సాక్షి, చెన్నై: తమ సమస్యల్ని విన్నవించుకునేందుకు రామనాథపురం జిల్లా రామేశ్వరం జాలర్ల సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరనున్నారు. మంగళవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ కానున్నారు. తమ వాళ్లెవరూ ఇంత వరకు ఫోన్లో మాట్లాడలేదని, తమకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదంటూ ఉరిశిక్ష ను ఎదుర్కొంటున్న బాధితులు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమిళ జాలర్లు ఐదుగురికి కొలంబో న్యాయస్థానం ఉరి శిక్షను విధించడం, దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలతో ఆ జాలర్లను రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం అప్పీలు కు వెళ్లింది. అదే సమయంలో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న వాళ్లను విడుదల చేయిస్తామంటూ శ్రీలంక వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, ఇవన్నీ పత్రికల్లో వస్తున్న కథనాలేనని, తమను ఇంత వరకు ఎవరూ సంప్రదించి భరోసా ఇవ్వలేదని బాధితుల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లు శ్రీలంక నుంచి ఫోన్‌లో మాట్లాడినట్టుగా, అందుకు తగ్గ ఏర్పాట్లను రాయబార అధికారులు చేసినట్టుగా పత్రికల్లో చూసి విస్మయం చెందామని మండి పడుతున్నారు. తమ వాళ్లను విడుదల చేశారని, ఉరి రద్దు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయే గానీ, ఏ అధికారి గానీ, తమను కలిసి స్పష్టమైన హామీ ఇవ్వలేదని వాపోతున్నారు. తమ వాళ్లెవరూ ఇంత వరకు ఫోన్లలో మాట్లాడ లేదని, తమ వాళ్లు ఇక్కడికి వచ్చే వరకు ఏ వార్తను, ఏ కథనాన్ని తాము నమ్మబోమని స్పష్టం చేశారు. నలుగురు బాధితుల భార్యలు స్కెనిట, సెల్వి, లావణ్య, ఝాన్సీ, మరో బాధితుడి తల్లి ఇన్వెస్టాలతోపాటుగా మరో పది మంది మహిళలు రామేశ్వరంలో ఆదివారం నిరసన దీక్ష తెలిపారు. తమ వాళ్ల విడుదలకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలను కేంద్రం తమ దృష్టికి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో సమాచారం రాని పక్షంలో పార్లమెంట్ ఎదుట ఆందోళనకు తాము సిద్ధం అని ప్రకటించారు.
ఢిల్లీకి పయనం : ఓవైపు బాధితుల కుటుంబీకులు ఆందోళన చేస్తుంటే, మరో వైపు ఢిల్లీకి పయనం అయ్యేందుకు జాలర్ల సంఘాల ప్రతినిధులు సిద్ధమయ్యారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం జాలర్లు దీక్ష విరమించిన విషయం తెలిసిందే. దీక్ష విరమణతో వీరిని బీజేపీ నేత నాగరాజన్ కలుసుకుని సంప్రదింపులు జరిపారు. రామేశ్వరం జాలర్ల ప్రతినిధులు ఐదుగురికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలియజేశారు. సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొచ్చేందుకు సిద్ధం కావాలని నాగరాజన్ సూచించడంతో ఢిల్లీకి పయనం అయ్యేందుకు ప్రతినిధులు సిద్ధం అయ్యారు. ఐదుగురు జాలర్లతోపాటుగా శ్రీలంక చెరలో ఉన్న మరో 29 మంది జాలర్ల విడుదల , 81 పడవల స్వాధీనం లక్ష్యంగా సుష్మాస్వరాజ్‌తో జరిగే భేటీలో ఒత్తిడి తీసుకురాబోతున్నట్టు జాలర్ల సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్నామని, మంగళవారం సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నామన్నారు.
ఢిల్లీకి జాలర్లు
Published Mon, Nov 17 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement