మణిరత్నం డెరైక్షన్‌లో ధనుష్ చిత్రం
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, నటుడు ధనుష్ కలయికలో ఒక వైవిధ్యభరిత చిత్రం తెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. కడల్ చిత్రం తరువాత మణిరత్నం తమిళం, తెలుగు భాషల్లో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం చేయాలని భావించారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌లు జంట ఓకే కన్మణి అనే విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని సమాచారం.
తదుపరి నటుడు ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. బాలీవుడ్ చిత్రం షమితాబ్‌ను తమిళ చిత్రం అనేగన్‌ను పూర్తి చేసిన ధనుష్ ప్రస్తుతం మారి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజి మోహన్ దర్శకుడు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు ధనుష్ ప్రకటించారు. ఆ తరువాత ఈ యువ నటుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై కోలీవుడ్‌లో చర్చ మొదలైంది.