రేసులో దినకరన్
► 50 వేల మెజారిటీతో గెలుపు తథ్యం
► ఉప ప్రధాన కార్యదర్శి ధీమా
► సీఎం పదవి మీద ఆశ లేదని స్పష్టీకరణ
► కేపీఎస్ సీఎంగా కొనసాగుతారని ప్రకటన
సాక్షి, చెన్నై: అందరూ ఊహించినట్టే అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల రేసులో దిగారు. దినకరన్ పేరును అన్నాడీఎంకే పరిపాలనా కమిటీ «ఖరారు చేయడంతో ఆ పార్టీ వర్గాలు ఆనంద తాండవం చేశాయి. ఇక, 50 వేల మెజారిటీతో గెలిచి తీరుతానన్న ధీమాను దినకరన్ వ్యక్తం చేశారు. తనకు సీఎం పదవి మీద ఆశ లేదని, ఎడపాడి పళని స్వామి సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆర్కేనగర్ నుం చి వరుసగా రెండుసార్లు అమ్మ జయలలిత అసెంబ్లీ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. అమ్మ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో తానే పోటీ చేయడానికి ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సిద్ధం అయ్యారన్న సంకేతాలు వెలువడ్డాయి.
అయితే, పార్టీ పరిపాలనా కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థి ప్రకటన ఉంటుందని టీటీవీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయం ఆవరణలో పది నిమిషాల పాటు జరిగిన ఆ కమిటీ సమావేశంలో దినకరన్‌ను అభ్యర్థిగా నిర్ణయించారు. ఇందుకు తగ్గ ప్రకటనను ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ , మంత్రి సెంగోట్టయన్ చేశారు. దీంతో అక్కడున్న అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తూ, దినకరన్ దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. పుష్పగుచ్ఛాలు, పూల మాలలు, శాలువలతో ముంచెత్తారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆ కమిటీకి, చిన్నమ్మ శశికళకు దినకరన్ కృతజ్ఞత తెలుపుకున్నారు.
సీఎం కావాలన్న ఆశ లేదు:
మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, అమ్మ జయలలిత నియోజకవర్గంలో పోటీకి తనకు అవకాశం కల్పించడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. ఆర్కేనగర్‌లో అమ్మ వదలి వెళ్లిన పనులు, ఆశయాల సాధనను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈ ఎన్నికల ద్వారా తనకు కల్పించడం మహద్భాగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజాదరణతో 50వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఒక్కరేనని, ఇతర అభ్యర్థులను తాను లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. 21వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు, రెండాకుల చిహ్నం మీదే అన్నాడీఎంకే పోటీ ఉందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల అనంతరం మాజీ సీఎం పన్నీరుసెల్వం అడ్రస్సు గల్లంతు కావడం తథ్యమన్నారు.
ఈ ఎన్నికల్లో తాను గెలిచినా, సీఎం పదవిని మాత్రం చేపట్టనని స్పష్టం చేశారు. ఆ ఆశ తనకు లేదని, అన్న ఎడపాడి పళనిస్వామి బ్రహ్మాండ పాలనను అందిస్తున్నారని, ఆయనే సీఎంగా కొనసాగుతారన్నారు. అన్నాడీఎంకే అధికారం, ప్రభుత్వ అధికారం ఒకరి చేతిలోనే ఉండాలన్నదే గతంలో సీనియర్ల అభిప్రాయం అని, అయితే, ఇక, ఆ పద్ధతి కొనసాగదని స్పష్టం చేశారు. సీఎంను మార్చే ప్రసక్తే లేదని ముగించారు. ఇప్పటికీ సీఎం ఆశ తనకు లేదని దినకరన్ పైకి చెప్పుకున్నా, అన్నాడీఎంకే వర్గాల, అందరి అభిప్రాయం మేరకు ఆ బాధ్యతలు చేపడుతానని ఎన్నికల అనంతరం కొత్త పల్లవిని ఆయన అందుకున్న అందుకోవచ్చేమో. ఇందుకు ఉదాహరణ చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా పలికిన పలుకులే. ఇక, తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలకు దినకరన్ వేడుకోలు పంపించగా, ఆ రెండు పార్టీలు తిరస్కరించాయి.
దినకరన్ రాజకీయ పయనం:
జయలలిత నెచ్చెలి శశికళ సోదరి వణితామణి కుమారుడు దినకరన్. ఇతడి సోదరుడే జయలలిత దత్తపుత్రుడిగా మెలిగిన సుధాకరన్. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెరియకుళం నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో ఆ పదవి కాలం ముగియడంతో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. పార్టీ కోశాధికారిగా కూడా వ్యవహరించారు. 2011లో అమ్మ జయలలిత ఆగ్రహానికి గురై పార్టీ నుంచి బహిష్కరణకు గుయ్యారు. అమ్మ మరణంతో గత నెల ఫిబ్రవరి 15న దినకరన్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి రాగానే, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం గమనార్హం. ఈ పదవి చేపట్టి నెల రోజుల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ప్రకటించ బడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే, ఆయన సీఎం కావడం తథ్యం అన్న ప్రచారం అన్నాడీఎంకేలో ఊపందుకోవడం ఆలోచించ దగ్గ విషయం. ఇక, దినకరన్ మీద విదేశీ మారక ద్రవ్యంతో పాటు, సింగపూర్ సిటిజన్ వ్యవహారం వంటి పలు కేసులు కూడా ఉన్నాయి.