
తాప్సీకి క్లాస్ పీకిన దర్శకుడు
ఇదీ కథ అని చెప్పి సినిమా తీసే కాలం కొండెక్కి చాలా ఏళ్లు అయ్యింది.అందుకు కారణం లేకపోలేదు. ఇదీ మా చిత్ర కథ, ఇదీ టైటిల్ అని ప్రకటించగానే ఆ కథ నాది, ఈ టైటిల్ నాకు చెందింది అంటూ కోర్టులు కేసులు పెట్టే సంస్కృతి పెరిగిపోయిందిప్పుడు. దీంతో చిత్ర కథ గురించి కాదు కదా, అందులో చిన్న సన్నివేశం గురించి కూడా దర్శక నిర్మాతలు బయటికి పొక్కనివ్వడంలేదు. చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం నోళ్లకు కూడా హెచ్చరికల తో తాళాలు వేస్తున్నారు. విలేకరుల సమావేశాల్లో కూడా యాక్షన్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్, వినోదభరిత కథా చిత్రం అని చెప్పి సరిపెట్టుకుంటున్నారు. శంకర్ లాంటి కొందరు దర్శకులయితే సినిమాకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేయడంలేదు.
అలాంటిది నటి తాప్సీ తాను నటిస్తున్న తాజా చిత్ర కథ కాన్సెప్ట్‌ను, తన పాత్ర వివరాలనూ విలేకరుల ముందుంచడంతో ఆ చిత్ర దర్శకుడు అప్‌సెట్ అవడంతో పాటు నటి తాప్సీకి క్లాస్ పీకాడట. వివరాల్లోకెళితే ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖాన్. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ, క్యాథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఖాన్ చిత్రం ఇంటిల్‌జెన్సీ విభాగానికి చెందిన కథ అనీ, తానిందులో ఇంటిల్‌జెన్సీ అధికారిగా నటిస్తున్నట్లు గొప్పగా చెప్పేశారట. దీంతో దర్శకుడు సెల్వరాఘవన్ తాప్సీకి ఫోన్ చేసి మరీ క్లాస్ పీకాడట.పాపం తాప్సీ? అసలే అరకొర అవకాశాలు. ఇప్పుడీ రాద్దాంతం ఆమెకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో వేచి చూడాల్సిందే.