- ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం
- విధుల్లో చేరని వారిపై ఆరా
- ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు అందుకోని ఉద్యోగులపై చర్యకు సిద్ధం
సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ పాలన వేగం పుంజుకుంటోంది. కొత్త జిల్లాగా ఏర్పడి మూడు రోజులు గడవకముందే జిల్లా పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టడంతో పాటు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రత్యేక దృష్టి సారించారు.
కొత్త జిల్లాలో పాలనాపరమైన బాలారిష్టాలు దాటి ప్రజాపాలన మెరుగు పడేందుకు కొంత సమయం పడు తుందన్న సహజ అభిప్రాయానికి భిన్నంగా పాలనను వేగవంతం చేసేందుకు కలెక్టర్ నడుం బిగించారు. ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూనే.. మరోవైపు అభివృద్ధి అంశాలపై జిల్లా పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
జిల్లా పాలనా సారధిగా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లా పాలనపై దృష్టి సారించిన రాజీవ్‌గాంధీ హన్మంతు కొత్త జిల్లా అధికారులతో తన చాంబర్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలనాపరంగా ప్రజలకు ఎలా అందుబాటు లో ఉండాలి, ఏయే అంశాలకు ప్రథమ ప్రాధా న్యం ఇవ్వాలి అనే అంశాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కొత్త జిల్లాలో అధికారులకు, వివిధ ప్రభుత్వ శాఖలకు కార్యాలయ భవనాల పరిశీలన, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను స్వయంగా కలెక్టరే పర్యవేక్షిస్తున్నారు. వీటితోపాటు కొత్త జిల్లాలో గ్రామ, మండల స్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, వారి అవసరాలను సత్వరమే తీర్చేలా క్షేత్రస్థారుు పర్యటన చేయాలని అధికారులను కార్యోన్ముఖులను చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి..
జిల్లా అధికారులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ప్రజల సాధక, బాధకాలను తక్షణమే పరిష్కరించాలని, వారికి అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. కొత్తజిల్లాకు ఎంతమంది జిల్లా అధికారులను నియమించారు, వారిలో ఎంతమంది బాధ్యత తీసుకున్నారు, బాధ్యతలు చేపట్టని వారు ఎవరు అనే అంశాలపై సమీక్ష సమావేశంలో ఆరా తీశారు.
ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతరు చేయకుండా బాధ్యతలు చేపట్టని వారి వివరాలను తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసేందుకు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ఏ విధంగా అమలయ్యాయో శాఖలవారీగా సమీక్షించారు. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు అందుకోని వారు, కేటాయించిన ప్రదేశాల్లో బాధ్యతలు చేపట్టని ఉద్యోగుల వివరాలపై ఆరా తీశారు.
వారిపై చర్య తీసుకోవడానికి వెనుకాడవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రాద్రి జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రోజుల్లో శాఖలవారీగా సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొత్త జిల్లాలో ఉద్యోగులు, అధికారులు మరింత అందుబాటులోకి వచ్చారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించేలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని, క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలన్నారు.