దీపావళి ప్రత్యేక రైళ్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి
Published Fri, Oct 25 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
సాక్షి, చెన్నై: దీపావళి ప్రత్యేక రైళ్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. పన్నెండు రైళ్ల రిజర్వేషన్లు 15 నిమిషాల్లోనే ముగిశాయి. వెయిటింగ్ లిస్ట్ సంఖ్య వందల్లో ఉంది. తమిళనాడులో సంక్రాంతి తర్వాత దీపావళి పండగకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగ రీత్యా, ఇతర పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల్లో ఉన్నా పండగ నాటికి స్వగ్రామాలకు పరుగులు తీస్తుంటారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరుస్తుంటాయి. దీపావళికి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రాష్ర్టంలోని ప్రధాన నగరాల్లోని జనం సిద్ధం అవుతున్నారు. బస్సులు, రైళ్లల్లో రిజర్వేషన్లు చేసుకునే పనిలో పడ్డారు. వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం దీపావళికి రెండు రోజుల ముందు నుంచే ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సుమారు ఎనిమిది వేల బస్సుల్ని చెన్నై నుంచి మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, కోయంబత్తూరు తదితర జిల్లాల కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, ఆయా జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల్ని నడిపేందుకు చర్యలు తీసుకుంది. బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు దాదాపు ముగింపు దశకు చేరాయి.
ప్రత్యేక రైళ్లు
ప్రతి రోజూ చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల మీదుగా నడిచే రైళ్ల రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తయ్యాయి. రెండు రోజులకు ఓ పర్యాయం నడిచే రైళ్లు, వారాంతపు రైళ్లలో వెయిటింగ్ లిస్టుల సంఖ్య వందకు పైగా ఉన్నాయి. గత వారం కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా వాటిలో అన్ని సీట్లు, బెర్త్‌లు ఇప్పటికే రిజర్వు అయ్యాయి. ఇప్పటి వరకు 84 ప్రత్యేక రైళ్లను దక్షిణ రైల్వే ప్రకటించింది. అలాగే ఈ నెల 31 నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణాది జిల్లాల మీదుగా ప్రత్యేకంగా పన్నెండు రైళ్లను నడిపేందుకు అధికారులు బుధవారం చర్యలు తీసుకున్నారు. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల మీదుగా పక్క రాష్ట్రాలకు, చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఇందులో చెన్నై - తిరువనంతపురం, తిరుచ్చి - షిర్డీ, నాగర్ కోవిల్ - చెన్నై, నాగర్ కోవిల్ - కాచిగూడ, కొచ్చివెలి-దిబ్రుగా, - బెంగళూరు తదితర రైళ్లు ఉన్నాయి. అలాగే ఎగ్మూర్ - తిరుచ్చి - మదురై - తిరునల్వేలి, కోయంబత్తూరు - ఈరోడ్ - సేలం - చెన్నై సెంట్రల్ మధ్య పలు రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు.
పూర్తయిన రిజర్వేషన్లు
ప్రత్యేక రైళ్ల ముందస్తు రిజర్వేషన్ ఉదయం ప్రారంభమైంది. రిజర్వేషన్ కోసం తాంబరం, ఎగ్మూర్, సెంట్రల్ రైల్వే స్టేషన్లకు ఉదయాన్నే జనం పరుగులు తీశారు. గంటల తరబడి రిజర్వేషన్ కోసం వేచి చూశారు. కౌంటర్ తెరిచిన 15 నిమిషాల్లోనే రైళ్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో వచ్చిన వారిలో 90 శాతం మంది నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. కొందరు వెయిటింగ్ లిస్టు అయినా పర్వాలేదంటూ, తమ అదృష్టానికి పరీక్ష పెట్టుకునే పనిలో పడ్డారు. స్లీపర్, ఏసీ కోచ్‌లు అన్ని నిమిషాల వ్యవధిలో నిండాయి. స్లీపర్‌లో అయితే, వెయింటింగ్ లిస్టులు వందల్లో ఉన్నాయి. ఏసీ కోచ్‌లలో సుమారు వంద వరకు వెయింటింగ్ లిస్టులు ఉండడం గమనార్హం. ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు కౌంటర్ల ద్వారా కంటే ఆన్‌లైన్‌లో ఈ బుకింగ్ చేసుకున్న వాళ్లే అధికం. ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు కౌంటర్ల ద్వారా తీసుకునే ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి గంటల తరబడి తాము క్యూలో నిలబడితే ఈ బుకింగ్ ద్వారా క్షణాల్లో టికెట్లను ట్రావెల్స్‌లు, ఏజెన్సీలు రిజర్వు చేసుకుంటున్నాయని మండి పడుతున్నారు. కాగా శుక్రరారం మరో ఆరు ప్రత్యేక రైళ్లకు ముందస్తు రిజర్వేషన్లు చేయనున్నారు.
Advertisement