HouseFull
-
ఐదు రెట్ల వినోదం
బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కెరీర్లో ‘హౌస్‌ఫుల్’ మూవీ ఫ్రాంచైజీది ప్రత్యేక స్థానం. అక్షయ్‌లోని కామెడీ స్టైల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ‘హౌస్‌ఫుల్’ చిత్రాలే. ఇప్పటివరకూ ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన నాలుగు చిత్రాల్లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌లు నటించారు. తాజాగా ‘హౌస్‌ఫుల్ 5’ని ప్రకటించారు. ‘దోస్తానా’, ‘డ్రైవ్’ సినిమాలకు దర్శకత్వం వహించిన తరుణ్ మన్సుఖాని ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాను తెరకెక్కించనున్నారు. సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ‘‘ఐదు రెట్ల వినోదంతో ‘హౌస్‌ఫుల్ 5’ను 2024 దీపావళికి విడుదల చేయనున్నాం’’ అన్నారు అక్షయ్ కుమార్. -
తిరుపతి-హైదరాబాద్ ‘వందేభారత్’ హౌస్‌ఫుల్..రైలులో ప్రయాణించిన సీఎస్
తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ రైలు ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచి్చంది. తిరుపతిలో ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరింది. ఈ రైలులో టీసీలుగా నలుగురు మహిళలు నియమితులయ్యారు. పి.అనితా (సీటీఐ), ఎంఎస్ సెల్వీ (టీటీఐ), బి.భారతి (టీటీఐ), రమణమ్మ (టీటీఐ) విధులు నిర్వర్తిస్తున్నారు. రైలును పరిశీలించేందుకు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వెంకటరమణారెడ్డి తిరుపతి రైల్వేస్టేషన్‌కు విచ్చేశారు. ఆయన వెంట సీనియర్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ చిన్నరెడ్డెప్ప, రైల్వే ఇన్స్పెక్టర్ మధుసూదన్ ఉన్నారు. మొదటి రోజే రైలులోని 520 టికెట్లు భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. తొలిరోజు రూ.9.50 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. మరో రెండు రోజులకు కూడా టికెట్లు బుక్ అయినట్టు తెలిపారు. ప్రయాణించిన సీఎస్.. వందే భారత్ రైలులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రయాణించారు. రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి రైల్వేస్టేషన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ శనివారం సికింద్రాబాద్‌లో వందే భారత్ ట్రైన్ ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. యాత్రికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం సీఎస్ జవహర్‌రెడ్డి తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి వందే భారత్ రైలులో గుంటూరుకు వెళ్లారు. అక్కడ నుంచి విజయవాడకు వెళ్లనున్నారు. ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, టీటీడీ జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మయ్య, నగరపాలక కమిషనర్ హరిత, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ వీడ్కోలు పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: 36 శాతం ‘వంట’ చెరకే! తొలి స్థానంలో మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే.. -
త్రీ డీల్!
సౌత్‌లో ప్రస్తుతం సూపర్ పాపులర్ హీరోయిన్స్ లిస్ట్‌లో పూజాహెగ్డే ఒకరు. వరుసగా టాప్ స్టార్స్ అందరితో జోడీ కడుతున్నారు. బాలీవుడ్లో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తేంటంటే బాలీవుడ్ ‘బడా ప్రొడక్షన్ హౌస్ నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్’తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారట. జుడ్వా, హౌస్‌ఫుల్, 2 స్టేట్స్, కిక్, భాఘీ చిత్రాలను నిర్మించిన సాజిద్ నడియాడ్వాలా ఈ మూడు చిత్రాలను భారీ లెవెల్లో నిర్మించనున్నారట. హౌస్‌ఫుల్ తర్వాత ఓ యాక్షన్ సినిమాను ఈ బ్యానర్లో పూజా హెగ్డే చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం రెండు నెలల భారీ డేట్స్ కూడా ఇచ్చారట. ఇందులో ఎన్నో స్టంట్స్ ఉండబోతున్నాయని, వాటిని పూజా స్వయంగా చేయబోతున్నారని తెలిసింది. యాంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ‘టూంబ్ రైడర్’ తరహాలో ఈ చిత్రకథ సాగనుందట. త్రీ మూవీస్ డీల్‌లో భాగంగా చేసిన సినిమాలు సక్సెస్ అయితే పూజ బాలీవుడ్‌లోనూ టాప్ లిస్ట్‌లో నిలబడడం ఖాయం. -
రాజాధిరాజా
విభిన్న సినిమాలు, విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుంటారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఇటీవల రిలీజైన ‘కేసరి’లో అక్షయ్ తలపాగా కట్టుకున్న సిక్కు పాత్రలో కనిపిస్తే తదుపరి చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో గుండుతో కనిపిస్తారట. ‘హౌస్‌ఫుల్’ కామెడీ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం ఇది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేశ్ దేశ్‌ముఖ్, రానా, కృతీ సనన్, కృతీ కర్బందా, పూజా హెగ్డే, బొమ్మన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రకథ ఉండబోతోందని టాక్. సినిమాలో అక్షయ్ కుమార్ 16వ శతాబ్దపు రాజుగా నటించారట. గుండు, మెలి తిరిగిన మీసాలతో అక్షయ్ లుక్ ఉండబోతోంది. పొడుగు జుట్టుతో బాబీ డియోల్ గెటప్ ఉండబోతోందట. గత జన్మలో జరిగిన కథను రాజస్థాన్‌లో, ప్రస్తుత కథను లండన్‌లో షూట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడంతో నానా పటేకర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అతని స్థానంలో రానా నటించారు. -
బాహుబలి హౌస్‌ఫుల్
నగరంలో 38 స్క్రీన్స్‌పై 150 షోలకుపైగా ప్రదర్శన లబ్బీపేట : ఇటీవల కాలంలో సినీ అభిమానులు ఎక్కడ చూసినా బహుబలి గురించే చర్చా.. భారీ బడ్జెట్.. రెండున్నరేళ్ల పాటు చిత్రీకరణ, వివాదాలు వంటి వాటితో అందరి దృష్టిలో బాహుబలి చిత్రమే నిలిచింది. కుర్రకారు, మధ్య వయస్సు, మహిళలు సినిమాను రిలీజ్రోజు చూసేందుకు పోటీ పడ్డారు. మల్టీప్లెక్స్‌లు, ఐనాక్స్‌లు, థియేటర్ల వద్ద రెండు రోజుల ముందు నుంచే టికెట్ల సందడి నెలకొంది. శుక్రవారం ఎక్కడ చూసినా బహుబలి సందడే..హీరో ప్రభాస్ పోస్టర్‌కు పలువురు క్షీరాభిషేకం నిర్వహించారు. నగరంలో తొలిరోజు 35 స్క్రీన్స్‌పై బెనిఫిట్ షోలతో కలిసి 150కి పైగా షోలు ప్రద ర్శించారు. దాదాపుగా అన్ని థియేటర్లలో ముందే టిక్కెట్లు ఇచ్చేయడంతో శుక్రవారం ఎక్కడా తోపులాటలు జరగలేదు. ఐనాక్స్, మల్టీప్లెక్స్‌లలో ఆన్లైన్ బుకింగ్స్ ఉండటంతో బుధవారం వరకూ హౌస్‌ఫుల్ అయిపోయాయి. -
దీపావళి ప్రత్యేక రైళ్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి
సాక్షి, చెన్నై: దీపావళి ప్రత్యేక రైళ్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. పన్నెండు రైళ్ల రిజర్వేషన్లు 15 నిమిషాల్లోనే ముగిశాయి. వెయిటింగ్ లిస్ట్ సంఖ్య వందల్లో ఉంది. తమిళనాడులో సంక్రాంతి తర్వాత దీపావళి పండగకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగ రీత్యా, ఇతర పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల్లో ఉన్నా పండగ నాటికి స్వగ్రామాలకు పరుగులు తీస్తుంటారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరుస్తుంటాయి. దీపావళికి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రాష్ర్టంలోని ప్రధాన నగరాల్లోని జనం సిద్ధం అవుతున్నారు. బస్సులు, రైళ్లల్లో రిజర్వేషన్లు చేసుకునే పనిలో పడ్డారు. వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం దీపావళికి రెండు రోజుల ముందు నుంచే ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సుమారు ఎనిమిది వేల బస్సుల్ని చెన్నై నుంచి మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, కోయంబత్తూరు తదితర జిల్లాల కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, ఆయా జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల్ని నడిపేందుకు చర్యలు తీసుకుంది. బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు దాదాపు ముగింపు దశకు చేరాయి. ప్రత్యేక రైళ్లు ప్రతి రోజూ చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల మీదుగా నడిచే రైళ్ల రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తయ్యాయి. రెండు రోజులకు ఓ పర్యాయం నడిచే రైళ్లు, వారాంతపు రైళ్లలో వెయిటింగ్ లిస్టుల సంఖ్య వందకు పైగా ఉన్నాయి. గత వారం కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా వాటిలో అన్ని సీట్లు, బెర్త్‌లు ఇప్పటికే రిజర్వు అయ్యాయి. ఇప్పటి వరకు 84 ప్రత్యేక రైళ్లను దక్షిణ రైల్వే ప్రకటించింది. అలాగే ఈ నెల 31 నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణాది జిల్లాల మీదుగా ప్రత్యేకంగా పన్నెండు రైళ్లను నడిపేందుకు అధికారులు బుధవారం చర్యలు తీసుకున్నారు. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల మీదుగా పక్క రాష్ట్రాలకు, చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఇందులో చెన్నై - తిరువనంతపురం, తిరుచ్చి - షిర్డీ, నాగర్ కోవిల్ - చెన్నై, నాగర్ కోవిల్ - కాచిగూడ, కొచ్చివెలి-దిబ్రుగా, - బెంగళూరు తదితర రైళ్లు ఉన్నాయి. అలాగే ఎగ్మూర్ - తిరుచ్చి - మదురై - తిరునల్వేలి, కోయంబత్తూరు - ఈరోడ్ - సేలం - చెన్నై సెంట్రల్ మధ్య పలు రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. పూర్తయిన రిజర్వేషన్లు ప్రత్యేక రైళ్ల ముందస్తు రిజర్వేషన్ ఉదయం ప్రారంభమైంది. రిజర్వేషన్ కోసం తాంబరం, ఎగ్మూర్, సెంట్రల్ రైల్వే స్టేషన్లకు ఉదయాన్నే జనం పరుగులు తీశారు. గంటల తరబడి రిజర్వేషన్ కోసం వేచి చూశారు. కౌంటర్ తెరిచిన 15 నిమిషాల్లోనే రైళ్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో వచ్చిన వారిలో 90 శాతం మంది నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. కొందరు వెయిటింగ్ లిస్టు అయినా పర్వాలేదంటూ, తమ అదృష్టానికి పరీక్ష పెట్టుకునే పనిలో పడ్డారు. స్లీపర్, ఏసీ కోచ్‌లు అన్ని నిమిషాల వ్యవధిలో నిండాయి. స్లీపర్‌లో అయితే, వెయింటింగ్ లిస్టులు వందల్లో ఉన్నాయి. ఏసీ కోచ్‌లలో సుమారు వంద వరకు వెయింటింగ్ లిస్టులు ఉండడం గమనార్హం. ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు కౌంటర్ల ద్వారా కంటే ఆన్లైన్లో ఈ బుకింగ్ చేసుకున్న వాళ్లే అధికం. ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు కౌంటర్ల ద్వారా తీసుకునే ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి గంటల తరబడి తాము క్యూలో నిలబడితే ఈ బుకింగ్ ద్వారా క్షణాల్లో టికెట్లను ట్రావెల్స్‌లు, ఏజెన్సీలు రిజర్వు చేసుకుంటున్నాయని మండి పడుతున్నారు. కాగా శుక్రరారం మరో ఆరు ప్రత్యేక రైళ్లకు ముందస్తు రిజర్వేషన్లు చేయనున్నారు.