చిక్కుల్లో కెప్టెన్
సాక్షి, చెన్నై : కింగ్...కింగ్ అంటు పరుగులు తీసి చివరకు చతికిలబడ్డ డీఎండీకే అధినేత విజయకాంత్ మరో చిక్కుల్లో పడ్డారు. ఆయన పార్టీ కొత్తకష్టాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎన్నికల యంత్రాంగం గుర్తింపు ఆ పార్టీకి దూరం కానున్నది. అలాగే, వీసీకే, ఎండీఎంకేలకు కూడా అదే కష్టాలు బయలు దేరాయి.తమిళనాట ప్రత్యామ్నాయం తామేనంటూ మూడో కూటమిగా మెగా పార్టీలతో తెర మీదకు వచ్చిన డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఓటర్లు చావు దెబ్బ తగిలేలా చేశారు. ఇదే ఇప్పుడు ఆపార్టీకి కష్టాల్ని సృష్టించనున్నాయి.
డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓ వైపు ఉంటే, మరో వైపు పార్టీకి ఎన్నికల యంత్రాంగం గుర్తింపు దూరం కానున్నది. పార్టీ ఆవిర్భావంతో పది, గత ఎన్నికల్లో ఎనిమిది శాతం మేరకు ఓటు బ్యాంక్ దక్కించు కున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించడంతోపాటు 29 మంది ఎమ్మెల్యేల్ని తన ఖాతాలో వేసుకుని ఎన్నికల యంత్రాంగం గుర్తింపు సైతం విజయకాంత్ పొందారు. ఆ పార్టీ ఎన్నికల చిహ్నంగా ఢంకా ముద్ర కూడా వేసుకున్నది. అయితే, ఇప్పుడు ఆ ముద్ర కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధినేత ఓటమి చవిచూడడమే కాకుండా, అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో పీకల్లోతు కష్టాలను విజయకాంత్ కొని తెచ్చుకున్నారు.
ఆ పార్టీ పోటీ చేసిన 104 నియోజకవర్గాల్లో వందలోపు నియోజకవర్గాల్లో కేవలం మూడు నుంచి ఐదు వేలలోపు ఓట్లు మాత్రమే రావడంతో చావు దెబ్బ తప్పలేదు. ఇంకా చెప్పాలంటే, ఎనిమిది శాతం మేరకు ఉన్న ఓటు బ్యాంక్ ఇప్పడు రెండున్నర శాతంలోపు పడి పోయింది. ఐదున్నర శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను కోల్పోయారు. ఎన్నికల యంత్రాంగం గుర్తింపు కావాలంటే, ఆరు శాతం ఓట్లు తప్పని సరి, అయితే, కెప్టెన్ పార్టీకి వచ్చిన ఓట్లు మరీ దారుణంగా ఉండడంతో ఇక గుర్తింపు దూరం అయినట్టే. అదే విధంగా ఎండీఎంకే నేత వైగోకు కష్టాలు తప్పడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించడం, ఈ ఎన్నికల్లో 26 చోట్ల పోటీ చేసి కేవలం 0.9 శాతం ఓట్లను దక్కించుకోవడంతో ఆ పార్టీకి గుర్తింపుతో పాటుగా చిహ్నం దూరం అయ్యే అవకాశాలు ఎక్కువే.
అలాగే, వీసీకే డిపాజిట్లు సైతం ఈ ఎన్నికల్లో గల్లంతు కావడం, 0.8 శాతం ఓట్లు మాత్రం దక్కడంతో పార్టీకి ఎన్నికల యంత్రాంగం వద్ద గుర్తింపు లేనట్టే. సీపీఎం 0.7 శాతం, సీపీఐ 0.8 శాతం ఓట్లను దక్కించుకుని రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఓ మూలన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయం...ప్రత్యామ్నాయం అంటూ వైగో ఇచ్చిన పిలుపుతో ఉరకలు తీసిన వీరికి ఈ సారి చావు దెబ్బ తగలడం గమనార్హం. అదే సమయంలో ఆలస్యంగా ఈ కూటమిలోకి చేరి ఎన్నికల గుర్తింపు పొందాలని తహ తహలాడిన తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్‌కు చెంప పెట్టే. తమిళ మానిల కాంగ్రెస్‌కు 0.5 శాతం మాత్రమే ఓట్లు దక్కాయి.
ఇంకా, చెప్పాలంటే, ఈ ఆరు పార్టీలు తలా సాధించిన ఓట్ల కంటే, నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువే. అలాగే, వీరి కన్నా, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పార్టీ 1.1 శాతం ఓట్లను కైవశం చేసుకోవడం గమనార్హం. కాగా, తమకు కష్టాలు ఎదురైనా, ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆరు పార్టీల నాయకులు శుక్రవారం తెర ముందుకు వచ్చారు. డీఎండీకే నేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్‌లు ప్రకటనల రూపంలో, ప్రెస్‌మీట్ల రూపంలో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఈ సమరంలో....చివరకు ప్రజా స్వామ్యాన్ని నోట్ల కట్టలు రాజ్యమేళాయన్న కొత్త పల్లవితో డిఎంకే, అన్నాడీఎంకేల మీద దుమ్మెత్తి పోశారు. అలాగే, ఇప్పుడు ఓడినా, భవిష్యత్తు తమదే అంటూ , కలిసి కట్టుగానే ప్రజల కోసం తమ పోరాటం ఆగదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ కలిసి కట్టు అన్నది స్థానిక సంస్థల ఎన్నికల వరకు అయినా, నిలుస్తుందో లేదో అన్నది వేచి చూడాల్సిందే.