కాంగ్రెస్‌లో చర్చ
డీఎండీకే వస్తే తగ్గింపు
నేడుజిల్లాల నేతలతో
ఈవీకేఎస్ సమాలోచన
సాక్షి, చెన్నై : ‘30 కాదు 40’ ఇస్తే డీఎంకేతో కలసి పనిచేయడానికి సిద్ధం అన్న సంకేతాన్ని కాంగ్రెస్ వర్గాలు ఇస్తున్నారు. తమను అక్కున చేర్చుకునేందుకు డీఎంకే సిద్ధంగా ఉండడంతో తమకు పట్టున్న స్థానాల్ని గురి పెట్టి తమ కార్యక్రమాల్ని విస్తృతం చేయడానికి కాంగ్రెస్ వర్గాలు సిద్ధం అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలసి కాంగ్రెస్ పనిచేసిన విషయం తెలిసిందే. 63 స్థానాల్లో బరిలోకి దిగి, ఐదు స్థానాల్ని మాత్రం దక్కించుకుంది. ఈ రెండు పార్టీలకు ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో చావు దెబ్బ తప్పలేదు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను డీఎంకే
పక్కన పెట్టింది. చిన్న పార్టీలతో డీఎంకే, ఒంటరిగా కాంగ్రెస్ ఎన్నికల్ని ఎదుర్కొన్న ఆ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కాక తప్పలేదు.
ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల కసరత్తులు చాప కింద నీరులా రాజకీయ పక్షాలు సాగిస్తున్నాయి. ఈ సమయంలో డీఎంకే కూటమిలోకి వస్తే కాంగ్రెస్‌కు కేవలం ముప్పై సీట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యలు చేయడం, దీనిని డీఎంకే అధిష్టానం ఖండించడం చోటు చేసుకున్నాయి. దీనిని కాంగ్రెస్ వర్గాలు పరిగణలోకి తీసుకుని ఉన్నారు. ఒంటరిగా ఉన్న తమను అక్కున చేర్చుకునేందుకు డీఎంకే సిద్ధం కావడంతో తమకు పట్టు న్న స్థానాల్లో కార్యక్రమాల్ని విస్తృతం చేయడానికి కాంగ్రెస్ వర్గాలు సిద్ధం అయ్యాయి. పార్టీ నుంచి జీకే వాసన్ బయటకు వెళ్లడంతో కొంత మేరకు బలం తగ్గినా, తమకు 40 స్థానాల్లో బలం ఉందన్న వాదనను తెర మీదకు తెచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు సిద్ధం అయ్యాయి.
40కు రెడీ :
గత అసెంబ్లీ ఎన్నికల్లో వాసన్ వర్గీయులు ఒకరు మాత్రమే గెలిచినా, ఆయన కూడా తమ వెంటే ఉన్నారన్న వాదనను కాంగ్రెస్ వర్గాలు తీసుకొచ్చే పనిలో పడ్డారు. వాసన్ రూపంలో కాంగ్రెస్‌కు దెబ్బ లేదని చాటుకుని, డీఎంకేతో సాగే సంపద్రింపుల ద్వారా 40 సీట్లను రాబట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. గతంలో తాము గెలిచిన స్థానాలతో పాటుగా, తక్కువ ఓట్లతో గెలుపు దూరమైన స్థానాల్ని గురి పెట్టి, అక్కడి నాయకుల ద్వారా పార్టీ పరంగా కార్యక్రమాల్ని వేగవంతం చేయడానికి టీఎన్‌సీసీ సిద్ధం అవుతున్నది. తమకు ముప్పై సీట్లు ఇవ్వడం కాదని, నలభై సీట్లు ఇస్తే బాగుంటుందన్న సంకేతాన్ని డిఎంకే వద్దకు పంపించేందుకు ఆ పార్టీ వర్గాలు సిద్ధం అయ్యారు. ఒక వేళ డిఎంకే కూటమిలోకి డీఎండీకే వచ్చిన పక్షంలో ఆ సమయానికి అనుగుణంగా సీట్లు తగ్గించుకుంటామని, తాము డీఎంకేతో కలసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నామన్న సంకేతాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు టీఎన్‌సీసీ వర్గాలు కార్యచరణ సిద్ధం చేస్తున్నాయి.
జిల్లాల నేతలతో సమాలోచన: డీఎంకే వర్గాలు తమను అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలతో కాంగ్రెస్ వర్గాలు సమాలోచనకు సిద్ధం అయ్యారు. ఆ గమేఘాలపై పార్టీ జిల్లాల నేతలతో సమాలోచనకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పిలుపు నివ్వడం గమనార్హం. శనివారం ఉదయం చెన్నై లోని సత్యమూర్తి భవన్ వేదికగా ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో మద్య నిషేధ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటుగా, పట్టున్న నియోజకవర్గాల్లో కార్యక్రమాల వేగవంతం, ప్రజలకు దగ్గరయ్యే విధంగా దూసుకెళ్లడానికి కార్యచరణ సిద్ధం చేసే అవకాశాలు ఎక్కువే.
40 ఇస్తేనే!
Published Sat, Sep 5 2015 3:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement