అసెంబ్లీలో రగడ ముగ్గురు డీఎండీకే ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కేసుల నమోదుకు కసరత్తులు సాగుతుండడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇప్పటి వరకు వారి మీద ఎలాంటి కేసుల్లేవు అని తేలడంతో బెయిల్ పిటిషన్లను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.
సాక్షి, చెన్నై : అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సభలో క్రమ శిక్షణ తప్పిన ముగ్గురు డీఎండీకే సభ్యులను సస్పెండ్ చేశారు. స్పీకర్ ఆదేశాలతో డీఎండీకే సభ్యులను బయటకు మార్షల్స్ గెంటించారు. ఈ సమయంలో ముగ్గు రు ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించినట్టు, విధుల్లో ఉన్న అధికారి గాయపడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికే పలు రకాల కేసులతో తల్లడిల్లుతున్న డీఎండీకే వర్గాలకు తాజా, కేసు ముచ్చెమటలు పట్టించింది. పలు రకాల సెక్షన్లతో కేసుల నమోదుకు పోలీసులు కసరత్తులు వేగవంతం చేసినట్టు సంకేతాలు వెలువడటంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లక తప్పలేదు. వీరి అరెస్టు లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్‌కు పోలీసుల బృందం వెళ్లినట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో మరింత ఆందోళన పడ్డ అజ్ఞాతంలో ఉన్న ఆ ముగ్గురిలో ఒకరైన ఎమ్మెల్యే మోహన్‌రాజు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
కేసుల్లేవు : ఈ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారం న్యాయమూర్తి దేవ దాసు నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ భాస్కర్ హాజరైన వాదనల్ని విన్పించారు. పిటిషనర్‌పై కేసులు నమోదు చే శారని, అవి ఎలాంటి కేసులో అన్నది తేలియడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కేసుల వివరాలు, ఎఫ్‌ఐఆర్ నమోదు గురించి పోలీసులను బెంచ్ వివరణ కోరింది. గురువారం తదుపరి విచారణ సాగడంతో ప్రభుత్వం తరపున న్యాయవాది రియాజ్ తన వాదన విన్పించారు. మోహన్‌రాజుపై ఎలాంటి కేసుల్లేవు అని, నమోదు కూడా చేయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ తరపున వాదనతో ఏకీభవించినన్యాయమూర్తి పి దేవదాసు కేసుల్లేవు కాబట్టి ముందస్తు బెయిల్ అవసరం లేదని తేల్చారు. ఈ విచారణను ముగిస్తున్నామని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను తోసి పుచ్చారు. తన మీద కేసుల్లేని దృష్ట్యా, చివరకు కంగుతినాల్సిన వంతు ఎమ్మెల్యేకు ఏర్పడింది. అసెంబ్లీలో రగడకు కీలకం ఎమ్మెల్యే మోహన్‌రాజే. ఆయన మీద కేసులేన్నప్పుడు తమ మీదు ఇక కేసులు పెట్టి ఉండరన్న ధీమా మరో ఇద్దరు ఎమ్మెల్యేల్లో నెలకొంది. ఇప్పటి వరకు కేసులు నమోదు లేదని తేల్చిన పోలీసులు, తాము బయటకు రాగానే, రాత్రికి రాత్రే కేసులు పెట్టి, ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న బెంగ ఆ ఎమ్మెల్యేల్ని వీడటం లేదు.
డీఎండీకే ఎమ్మెల్యేలపై కేసుల్లేవు
Published Fri, Feb 27 2015 12:41 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement