DMDK MLAs
-
ఆరుగురు ఎమ్మెల్యేల అజ్ఞాతవాసం
అధికార (అమ్మ) పార్టీని నిందిస్తే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో డీఎండీకే ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ రుచి చూపించారు. ఎమ్మెల్యేలమనే విషయాన్నే ఏడాదిపాటు మరిచిపోయేలా నిషేధం విధించారు. పంచపాండవుల అజ్ఞాతవాసాన్ని తలపించేలా అనేక ఆంక్షలను అమలులోకి తెచ్చారు. సస్పెన్షన్ మాత్రమే కాదు షరతులు వర్తిస్తాయి అంటూ ఉత్తర్వులు జారీచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రగడ సృష్టించారు. బడ్జెట్ ప్రతులను చింపివేయడం, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడం, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శనాస్త్రాలు సంధించడం వంటి గందరగోళాలకు పాల్పడ్డారు. చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాకుండా స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఆనాటి సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే సచి వాలయం ప్రాంగణంలో ప్రతిరోజూ ధర్నా చేపట్టి తమ నిరసన తెలిపారు. అంతేగాక డీఎంకే, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షపార్టీల మద్దతు కూడగట్టుకున్నారు. ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని మరో పదిరోజుల పాటూ పొడిగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంటే రాబోయే శీతాకాల అసెం బ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనే వీలులేకుండా చేశారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు 2016 జనవరి లేదా ఫిబ్రవరిలోనే జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడా ది అసెంబ్లీ ఎన్నికలు సైతం ముంచుకొస్తున్న కారణం గా ఆనాటి అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఈ కారణాల వల్ల సస్పెన్షన్ వేటుకు గురైన ఆరుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీ ముఖం చూస్తారా అనేది అనుమానంగా మారింది. అవమానంతోపాటూ ఆర్థికపోటు: దాదాపు ఏడాది నిషేధం డీఎండీకే ఎమ్మెల్యేలను అవమానంతోపాటు ఆర్థికపోటుకు గురిచేసింది. ఒక్కో ఎమ్మెల్యే నెలసరి వేతనం కింద మొత్తం రూ.55 వేలు పొందుతుంటారు. సస్పెన్షన్ వేటు పడిన ఎమ్మెల్యేలు సుమారు ఏడాది పాటు ఈ మొత్తాన్ని కోల్పోనున్నారు. అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కింద రూ.5వేలు, అసెంబ్లీ సమావేశాలకు హాజరైనపుడు చెల్లించే సిట్టింగ్ చార్జీ 500 కోల్పోనున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే హోదాలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకునేందుకు వీలులేదు. అంతేకాదు అసెంబ్లీ ప్రాంగణంలోని గ్రంథాలయం ప్రవేశం కూడా నిషిద్ధమే. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లకూడదు, అధికారిక కార్యక్రమాలకు హాజరుకారాదని షరతులు ఉన్నాయి. ఏడాది పాటూ ఆరుమంది సభ్యులు తాము ఎమ్మెల్యేమనే విషయాన్ని మర్చిపోవాలి. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో తిరుగుతూ పలుకుబడి పెంచుకునే వీలులేకుండా అధికారపక్షం ఎత్తుగడవేసింది. బహుశా ఎమ్మెల్యేలపై ఇంత పెద్ద వేటు, ఆర్థికపోటు మరే రాష్ట్రంలోనూ చోటుచేసుకోలేదని భావించవచ్చు. -
డీఎండీకే ఎమ్మెల్యేలపై కేసుల్లేవు
అసెంబ్లీలో రగడ ముగ్గురు డీఎండీకే ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కేసుల నమోదుకు కసరత్తులు సాగుతుండడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇప్పటి వరకు వారి మీద ఎలాంటి కేసుల్లేవు అని తేలడంతో బెయిల్ పిటిషన్లను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. సాక్షి, చెన్నై : అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సభలో క్రమ శిక్షణ తప్పిన ముగ్గురు డీఎండీకే సభ్యులను సస్పెండ్ చేశారు. స్పీకర్ ఆదేశాలతో డీఎండీకే సభ్యులను బయటకు మార్షల్స్ గెంటించారు. ఈ సమయంలో ముగ్గు రు ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించినట్టు, విధుల్లో ఉన్న అధికారి గాయపడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికే పలు రకాల కేసులతో తల్లడిల్లుతున్న డీఎండీకే వర్గాలకు తాజా, కేసు ముచ్చెమటలు పట్టించింది. పలు రకాల సెక్షన్లతో కేసుల నమోదుకు పోలీసులు కసరత్తులు వేగవంతం చేసినట్టు సంకేతాలు వెలువడటంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లక తప్పలేదు. వీరి అరెస్టు లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్‌కు పోలీసుల బృందం వెళ్లినట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో మరింత ఆందోళన పడ్డ అజ్ఞాతంలో ఉన్న ఆ ముగ్గురిలో ఒకరైన ఎమ్మెల్యే మోహన్‌రాజు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కేసుల్లేవు : ఈ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారం న్యాయమూర్తి దేవ దాసు నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ భాస్కర్ హాజరైన వాదనల్ని విన్పించారు. పిటిషనర్‌పై కేసులు నమోదు చే శారని, అవి ఎలాంటి కేసులో అన్నది తేలియడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కేసుల వివరాలు, ఎఫ్ఐఆర్ నమోదు గురించి పోలీసులను బెంచ్ వివరణ కోరింది. గురువారం తదుపరి విచారణ సాగడంతో ప్రభుత్వం తరపున న్యాయవాది రియాజ్ తన వాదన విన్పించారు. మోహన్రాజుపై ఎలాంటి కేసుల్లేవు అని, నమోదు కూడా చేయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ తరపున వాదనతో ఏకీభవించినన్యాయమూర్తి పి దేవదాసు కేసుల్లేవు కాబట్టి ముందస్తు బెయిల్ అవసరం లేదని తేల్చారు. ఈ విచారణను ముగిస్తున్నామని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను తోసి పుచ్చారు. తన మీద కేసుల్లేని దృష్ట్యా, చివరకు కంగుతినాల్సిన వంతు ఎమ్మెల్యేకు ఏర్పడింది. అసెంబ్లీలో రగడకు కీలకం ఎమ్మెల్యే మోహన్రాజే. ఆయన మీద కేసులేన్నప్పుడు తమ మీదు ఇక కేసులు పెట్టి ఉండరన్న ధీమా మరో ఇద్దరు ఎమ్మెల్యేల్లో నెలకొంది. ఇప్పటి వరకు కేసులు నమోదు లేదని తేల్చిన పోలీసులు, తాము బయటకు రాగానే, రాత్రికి రాత్రే కేసులు పెట్టి, ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న బెంగ ఆ ఎమ్మెల్యేల్ని వీడటం లేదు. -
ఎమ్మెల్యేల కోసం ఏపీలో వేట
చెన్నై, సాక్షి ప్రతినిధి : అసెంబ్లీ గొడవల నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న డీఎండీకే ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు సమాచా రం అందడంతో ప్రత్యేక పోలీసు బృం దం మంగళవారం బయలుదేరింది.ఈనెల 19వ తేదీ నాటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు ప్రసంగిస్తున్న తరుణంలో డీఎండీకే ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత మోహన్‌రాజ్ మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలు గుప్పించారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మోహన్‌రాజ్‌కు మద్దతుగా నిరసన గళం వినిపించారు. డీఎండీకే ఎమ్మెల్యేల విమర్శలపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం క్రమేణా తోపులాటకు దారితీసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తన చొక్కా పట్టుకులాగి కిందకు తోశారని మోహన్‌రాజ్ ఆరోపించారు. అన్నాడీఎంకే, డీఎం డీకే సభ్యల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకోగా సమావేశాలు రసాభాసకు దారితీశాయి. సభా కార్యక్రమాలకు డీఎండీకే ఎమ్మెల్యేలు భంగం కలిగిస్తున్నారంటూ స్పీకర్ ధనపాల్ వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోకి మార్షల్స్ ప్రవేశంతో డీఎండీకే ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయి వారిపై పుస్తకాలు, పేపర్లు విసిరివేశారు. ఈ తరుణంలో డీఎండీకే ఎమ్మెల్యేలు చంద్రకుమార్, మోహన్‌రాజ్, సీహెచ్ శేఖర్, దినకరన్‌ను వెలుపలకు పంపుతున్న మార్షల్స్‌లో ప్రత్యేక ఎస్ఐ విజయన్ (38) గాయపడ్డారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, దాడికి దిగారని తదితర సెక్షన్ల కింద ఫ్లవర్‌బజార్ పోలీస్ స్టేషన్లో కేసులు నమో దు చేశారు. ప్రతిపక్షంపై పగ తీర్చుకునేందుకు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారని భావించిన డీఎండీకే ఎమ్మెల్యేలు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మద్రా సు హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. విజయకాంత్ ఇంటిపైనా నిఘా డీఎండీకే ఎమ్మెల్యేల అరెస్ట్‌ను పంతంగా తీసుకున్న ప్రభుత్వం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించిం ది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైం పోలీసుల సహాయం కూడా తీసుకుంది. ఈ బృందంలోని పోలీసు అధికారుల పేర్లను ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు. ఎమ్మెల్యేలకు బెయిల్ మంజూ రయ్యేలోగా కటకటాల వెనక్కునెట్టాలని కసితో ఉంది. డీఎండీకే ఎమ్మెల్యేల ఇళ్లు, మిత్రులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. డీఎండీకే అధినేత విజ యకాంత్ ఇంటిపై కూడా బలమైన నిఘా పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గుమ్మిడిపూండి నియోజకవర్గ డీఎండీకే ఎమ్మెల్యే శేఖర్ సహాయంతో కోవై జిల్లా సూలూరు ఎమ్మెల్యే దినకరన్ జోడీగా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుని ఉన్నట్లు సమాచారం అందింది. అందిన సమాచారం మేరకు రెండు పోలీసు బృందాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నాయి. మరో రెండు బృందాలు రాష్ర్టంలో వేటాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేల అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. -
చిక్కుల్లో ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేతో వైర్యం ఏర్పడ్డ నాటి నుంచి డీఎండీకే వర్గాలు సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఏ చిన్న వ్యాఖ్య చేసినా, ఆరోపణలు గుప్పించినా పరువు నష్టం దావాలు దాఖలవుతూ వచ్చాయి. అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశం గత వారం ఆరంభమైంది. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం వివాదం రాజుకుంది. తమ గళాన్ని నొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎండీకే సభ్యులు అధికార పక్షంతో గట్టిగానే ఢీ కొట్టారు. అసెంబ్లీ వేదికగా వివాదం ముదరడంతో మార్షల్స్ ద్వారా బయటకు వారిని స్పీకర్ ధనపాల్ గెంటించారు. అలాగే, క్రమ శిక్షణ చర్యగా తాజా సమావేశాలు, తదుపరి సమావేశాలకు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చివరకు తగ్గిన స్పీకర్ ధనపాల్ ఈ సమావేశాలకు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్టు మరుసటి రోజు ప్రకటించారు. సస్పెన్షన్‌లో సవరణలు జరిగినా, డీఎండీకే ఎమ్మెల్యేలకు అసలు చిక్కంతా మార్షల్స్ రూపంలో కాచుకు కూర్చుంది. చిక్కుల్లో...ముగ్గురు టార్గెట్ బయటకు గెంటివేసే క్రమంలో డీఎండీకే ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో ఢీ కొట్టారు. ఈ క్రమంలో విజయన్ అనే సబ్ ఇన్స్పెక్టర్ గాయ పడ్డారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ద్వారా డీఎండీకే ఎమ్మెల్యే భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో, డీఎండీకే సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం పోలీసులకు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఫిర్యాదు చేయ డం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సబ్ ఇన్స్పెక్టర్ విజయన్ను సచివాలయం పోలీసులు శనివారం సాయంత్రం కలుసుకుని వివరణ తీసుకున్నారు. సంఘటన ఎలా జరిగింది, దాడి చేసిన ఎమ్మెల్యేల వివరాల్ని సేకరించారు. జమాలుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎండీకే ఎమ్మెల్యేలు మోహన్ రాజ్, శేఖర్, దినకరన్‌లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. నగర కమిషనర్ జార్జ్‌తో సచివాలయం పోలీసులు సమావేశమై కేసుల నమోదుకు సంబంధించి చర్చించడం గమనార్హం. వీరిపై ఎలాంటి సెక్షన్లను నమోదు చేయాలోనని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడి చేయడం వంటి సెక్షన్లను నమోదు చేయడానికి సచివాలయం పోలీసులు సిద్ధం అయ్యారని సమాచారం. అయితే, సోమవారం అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో మరుసటి రోజు డీఎండీకే ఎమ్మెల్యేల భరతం పట్టేవిధంగా కేసుల నమోదు, అరెస్టులకు కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.