ఆరుగురు ఎమ్మెల్యేల అజ్ఞాతవాసం
అధికార (అమ్మ) పార్టీని నిందిస్తే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో డీఎండీకే ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ రుచి చూపించారు. ఎమ్మెల్యేలమనే విషయాన్నే ఏడాదిపాటు మరిచిపోయేలా నిషేధం విధించారు. పంచపాండవుల అజ్ఞాతవాసాన్ని తలపించేలా అనేక ఆంక్షలను అమలులోకి తెచ్చారు. సస్పెన్షన్ మాత్రమే కాదు షరతులు వర్తిస్తాయి అంటూ ఉత్తర్వులు జారీచేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రగడ సృష్టించారు. బడ్జెట్ ప్రతులను చింపివేయడం, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడం, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శనాస్త్రాలు సంధించడం వంటి గందరగోళాలకు పాల్పడ్డారు. చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాకుండా స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఆనాటి సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే సచి వాలయం ప్రాంగణంలో ప్రతిరోజూ ధర్నా చేపట్టి తమ నిరసన తెలిపారు. అంతేగాక డీఎంకే, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షపార్టీల మద్దతు కూడగట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని మరో పదిరోజుల పాటూ పొడిగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంటే రాబోయే శీతాకాల అసెం బ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనే వీలులేకుండా చేశారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు 2016 జనవరి లేదా ఫిబ్రవరిలోనే జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడా ది అసెంబ్లీ ఎన్నికలు సైతం ముంచుకొస్తున్న కారణం గా ఆనాటి అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఈ కారణాల వల్ల సస్పెన్షన్ వేటుకు గురైన ఆరుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీ ముఖం చూస్తారా అనేది అనుమానంగా మారింది.
అవమానంతోపాటూ ఆర్థికపోటు: దాదాపు ఏడాది నిషేధం డీఎండీకే ఎమ్మెల్యేలను అవమానంతోపాటు ఆర్థికపోటుకు గురిచేసింది. ఒక్కో ఎమ్మెల్యే నెలసరి వేతనం కింద మొత్తం రూ.55 వేలు పొందుతుంటారు. సస్పెన్షన్ వేటు పడిన ఎమ్మెల్యేలు సుమారు ఏడాది పాటు ఈ మొత్తాన్ని కోల్పోనున్నారు. అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కింద రూ.5వేలు, అసెంబ్లీ సమావేశాలకు హాజరైనపుడు చెల్లించే సిట్టింగ్ చార్జీ 500 కోల్పోనున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే హోదాలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకునేందుకు వీలులేదు.
అంతేకాదు అసెంబ్లీ ప్రాంగణంలోని గ్రంథాలయం ప్రవేశం కూడా నిషిద్ధమే. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లకూడదు, అధికారిక కార్యక్రమాలకు హాజరుకారాదని షరతులు ఉన్నాయి. ఏడాది పాటూ ఆరుమంది సభ్యులు తాము ఎమ్మెల్యేమనే విషయాన్ని మర్చిపోవాలి. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో తిరుగుతూ పలుకుబడి పెంచుకునే వీలులేకుండా అధికారపక్షం ఎత్తుగడవేసింది. బహుశా ఎమ్మెల్యేలపై ఇంత పెద్ద వేటు, ఆర్థికపోటు మరే రాష్ట్రంలోనూ చోటుచేసుకోలేదని భావించవచ్చు.