ఎమ్మెల్యేల కోసం ఏపీలో వేట | DMDK MLAs Police searching two mlas in Andhra Pradesh Information | Sakshi

ఎమ్మెల్యేల కోసం ఏపీలో వేట

Published Wed, Feb 25 2015 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

అసెంబ్లీ గొడవల నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న డీఎండీకే ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలను

చెన్నై, సాక్షి ప్రతినిధి : అసెంబ్లీ గొడవల నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న డీఎండీకే ఎమ్మెల్యేలను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు సమాచా రం అందడంతో ప్రత్యేక పోలీసు బృం దం మంగళవారం బయలుదేరింది.ఈనెల 19వ తేదీ నాటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు ప్రసంగిస్తున్న తరుణంలో డీఎండీకే ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత మోహన్‌రాజ్ మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలు గుప్పించారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మోహన్‌రాజ్‌కు మద్దతుగా నిరసన గళం వినిపించారు.
 
 డీఎండీకే ఎమ్మెల్యేల విమర్శలపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ఇరుపక్షాల మధ్య  తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం క్రమేణా తోపులాటకు దారితీసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తన చొక్కా పట్టుకులాగి కిందకు తోశారని మోహన్‌రాజ్ ఆరోపించారు. అన్నాడీఎంకే, డీఎం డీకే సభ్యల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకోగా సమావేశాలు రసాభాసకు దారితీశాయి. సభా కార్యక్రమాలకు డీఎండీకే ఎమ్మెల్యేలు భంగం కలిగిస్తున్నారంటూ స్పీకర్ ధనపాల్ వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోకి మార్షల్స్ ప్రవేశంతో డీఎండీకే ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయి వారిపై పుస్తకాలు, పేపర్లు విసిరివేశారు.
 
 ఈ తరుణంలో డీఎండీకే ఎమ్మెల్యేలు చంద్రకుమార్, మోహన్‌రాజ్, సీహెచ్ శేఖర్, దినకరన్‌ను వెలుపలకు పంపుతున్న మార్షల్స్‌లో ప్రత్యేక ఎస్‌ఐ విజయన్ (38) గాయపడ్డారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, దాడికి దిగారని తదితర సెక్షన్ల కింద ఫ్లవర్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమో దు చేశారు. ప్రతిపక్షంపై పగ తీర్చుకునేందుకు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారని భావించిన డీఎండీకే ఎమ్మెల్యేలు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మద్రా సు హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు.
 
 విజయకాంత్ ఇంటిపైనా నిఘా
 డీఎండీకే ఎమ్మెల్యేల అరెస్ట్‌ను పంతంగా తీసుకున్న ప్రభుత్వం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించిం ది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైం పోలీసుల సహాయం కూడా తీసుకుంది. ఈ బృందంలోని పోలీసు అధికారుల పేర్లను ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు. ఎమ్మెల్యేలకు బెయిల్ మంజూ రయ్యేలోగా కటకటాల వెనక్కునెట్టాలని కసితో ఉంది. డీఎండీకే ఎమ్మెల్యేల ఇళ్లు, మిత్రులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. డీఎండీకే అధినేత విజ యకాంత్ ఇంటిపై కూడా బలమైన నిఘా పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గుమ్మిడిపూండి నియోజకవర్గ డీఎండీకే ఎమ్మెల్యే శేఖర్ సహాయంతో కోవై జిల్లా సూలూరు ఎమ్మెల్యే దినకరన్ జోడీగా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుని ఉన్నట్లు సమాచారం అందింది. అందిన సమాచారం మేరకు రెండు పోలీసు బృందాలు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నాయి. మరో రెండు బృందాలు రాష్ర్టంలో వేటాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేల అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement