స్టాలినే నా వారసుడు: కరుణ
టీనగర్,(చెన్నై): తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని డీఎంకే అధినేత కరుణానిధి సంచలన ప్రకటన చేశారు. అయితే, తన మరో కుమారుడు అళగిరిని తాను ఏమాత్రం మిస్‌కానని వ్యాఖ్యానించారు. ఓ తమిళ వారపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కరుణ మాట్లాడారు. పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు స్టాలిన్, అళగిరి ఇద్దరూ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. ఈ ఏడాది మేలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనకూడదని కరుణానిధి నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, తన రిటైర్‌మెంట్‌పై వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. కరుణానిధిని రిటెర్మైంట్ గురించి ప్రశ్నించగా.. తాను ఇప్పుడే రాజకీయ రిటైర్మెంట్ తీసుకుని పార్టీ పగ్గాలు వెంటనే స్టాలిన్‌కు ఇచ్చే ప్రశ్నే లేదని ఆయన స్పష్టంచేశారు.
పార్టీ వ్యవహారాల్లో స్టాలిన్ సహాయపడుతున్నారని, ఇప్పటికే పార్టీకి సంబంధించి చాలా విషయాలు ఆయనే చూసుకుంటున్నారని చెప్పారు. ‘63 ఏళ్ల స్టాలిన్ యువకుడిగా ఉన్నప్పటి నుంచే పార్టీ కోసం చాలా కష్టపతున్నాడు. యవ్వనంలో ఉన్నపుడే గోపాలపురంలో యువజన సంఘాన్ని స్థాపించి పాటుపడ్డాడు. పార్టీ కోసం జైలు శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో విధాలుగా చిత్ర హింసలకు గురయ్యాడు. పార్టీలో ఈ స్థానాన్ని తన కష్టంతోనే సంపాదించుకున్నాడు. అందుకే తన రాజకీయ వారసుడయ్యాడు’ అని కరుణానిధి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం స్టాలిన్ డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీ కోశాధికారిగా ఉన్నారు. స్టాలిన్ గతంలో ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పదవులు చేపట్టారు.