శ్రీరంగం ఉపఎన్నికల్లో ఓడినా.. డిపాజిట్ దక్కినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని డీఎంకే నిర్ణయించింది.
శ్రీరంగంలో నేడు డీఎంకే సభ
సాక్షి, చెన్నై : శ్రీరంగం ఉపఎన్నికల్లో ఓడినా.. డిపాజిట్ దక్కినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని డీఎంకే నిర్ణయించింది. ఈ మేరకు గురువారం శ్రీరంగంలోని దేవి థియేటర్ సమీపంలో ప్రత్యేక సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు ఆ పార్టీ కోశాధికారి ఎంకే.స్టాలిన్ హాజరు కానున్నట్లు సమాచారం. ఎన్నికల్లో తమను గెలిపించిన ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేయడం పరిపాటే. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాగరికత మేరకు గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్లు అభినందనలు తెలియజేయడం సహజం.
ఇలాంటి నాగరికత రాష్ర్టంలో లేదనే చెప్పవచ్చు. తాజాగా తమను ఓడించిన ఓటర్లకు కృత జ్ఞతలు తెలిపేందుకు డీఎంకే సిద్ధం కావడం విశేషం. శ్రీరంగం ఉపఎన్నిక ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 96 వేల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి వలర్మతి విజయ కేతనం ఎగురవేశారు. కేవలం 55 వేల ఓట్లకు డీఎంకే అభ్యర్థి ఆనంద్ పరిమితమయ్యారు. బీజేపీ, సీపీఎం డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఉపఎన్నికలో తాము ఓడినా, గతంలో వచ్చిన ఓట్లు వస్తే గెలిచినట్టేనని డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ ప్రకటించారు. గతంలో వచ్చిన ఓట్ల కంటే, అధికంగానే ఆ పార్టీ అభ్యర్థి ఆనంద్‌కు శ్రీరంగం ఓటర్లు కట్ట బెట్టారు. దీంతో ఓడినా, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి డీఎంకే నిర్ణయించింది. గురువారం దేవీ థియేటర్ సమీపంలో కృతజ్ఞత సభకు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పాల్గొని ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తారు.
నిరాడంబరంగా
డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మార్చి ఒకటో తేదీన 63వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే, తన బర్తడేను హంగు ఆర్భాటాలతో చేయొద్దని, నిరాడంబరంగా ప్రజా హితాన్ని కాంక్షించే రీతిలో నిర్వహించాలని పార్టీ వర్గాలకు స్టాలిన్ ఉపదేశించారు. ఎక్కడా, ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయొద్దని, మహిళా శిశు సంక్షేమార్థం కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 28న చెన్నైలో కోటి రూపాయలతో 20 వేల మందికి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి చేతుల మీదుగా సంక్షేమ పథకాలను పంపిణీ చేయడానికి నిర్ణయించారు.