లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల ఎంపికపై డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. గురువారం నుంచి ఆశావహుల ఇంటర్వ్యూలు ఆరంభం అయ్యాయి. అధినేత కరుణానిధి సమక్షంలో దరఖాస్తుల పరిశీలన, నియోజకవర్గాల వారీగా వివరాల సేకరణ జరుగుతోంది.
సాక్షి, చెన్నై:
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ఎన్నికల యంత్రాంగం లోక్‌సభ ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీలు తమ దైన శైలిలో దూసుకెళుతున్నాయి. కూటమి ప్రయత్నాలు ఓ వైపు చేస్తూ, మరో వైపు తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై డీఎంకే దృష్టి కేంద్రీకరించింది. గత నెల ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు. అధినేత కరుణానిధి, కోశాధికారి స్టాలిన్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పలువురు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాల్లో పోటీ నిమిత్తం దరఖాస్తుల్ని డీఎంకే ఆహ్వానించింది. ఇందులో 1500 మంది సీట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల చేసుకున్న వారందరినీ ఇంటర్వ్యూ చేయడానికి డీఎంకే అధిష్టానం నిర్ణయించింది.
ఆరంభం
అన్నా అరివాళయం వేదికగా గురువారం ఇంటర్వ్యూలు ఆరంభం అయ్యాయి. అధినేత కరుణానిధి సమక్షంలో ప్రధాన కార్యదర్శి అన్భళగన్, సంయుక్త కార్యదర్శి దురై మురుగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్‌లు ఇంటర్వ్యూలు నిర్వహించే పనిలో పడ్డారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని జిల్లా పార్టీ కార్యదర్శులు సైతం ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆయా అభ్యర్థుల పూర్తి వివరాలు, విద్యార్హత, జన, ధన బలం, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి వారు అందిస్తున్న సేవలు తదితర వివరాల్ని ఇంటర్వ్యూలో ఆశావహుల్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. తొలి రోజు ఉదయం కన్యాకుమారి, తిరునల్వేలి నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ హెలన్ డేవిడ్ సన్‌తో సహా 26 మంది కన్యాకుమారిలో పోటీ పడ్డారు. సాయంత్రం తెన్ కాశి, తూత్తుకుడి నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరిగాయి.
మూడో తేదీ వరకు ఇంటర్వ్యూల కొనసాగింపు
శుక్రవారం ఉదయం రామనాథపురం, విరుదునగర్, సాయంత్రం తేని, దిండుగల్, మదురై నియోజకవర్గాలకు, 22న ఉదయం శివగంగై, కరూర్, సాయంత్రం తంజావూరు, నాగపట్నం, మైలాడుతురై, తిరుచ్చి, 23న ఉదయం పెరంబలూరు, చిదంబరం, కడలూరు, సాయంత్రం నీలగిరి, పొల్లాచి, 25న ఉదయం కోయంబత్తూరు, తిరుప్పూర్, సాయంత్రం ఈరోడ్, నామక్కల్, 27న ఉదయం సేలం, కళ్లకురిచ్చి, సాయంత్రం విల్లుపురం, ధర్మపురి, 28న ఉదయం ఆరణి, తిరువణ్నామలై, సాయంత్రం కృష్ణగిరి, వేలూరు, అరక్కోణం, మార్చి రెండో తేదీ ఉదయం శ్రీ పెరంబదూరు, కాంచీపురం, తిరువళ్లూరు, మూడో తేదీన ఉత్తర, దక్షిణ, సెంట్రల్ చెన్నై, పుదుచ్చేరి నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరగనున్నట్టు డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ప్రకటించారు.
అభ్యర్థుల వేట!
Published Thu, Feb 20 2014 11:14 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement