దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
Published Sat, Sep 28 2013 1:01 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: ఆసుపత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా వైద్యులపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్యకేంద్రం డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. చెన్నై-తిరుపతి జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లూరు సమీపం పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన రోడ్డు కాంట్రాక్టర్ కమలనాథన్(40) గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. శవపరీక్ష నిమిత్తం ఆయన మృతదేహాన్ని తిరువళ్లూ జిల్లా వైద్యకేంద్రానికి తీసుకువచ్చారు.
అక్కడకు పెద్ద ఎత్తున మృతుని బంధువులు చేరుకున్నారు. వైద్యులు, నర్సులు, కవరేజ్ చేస్తున్న మీడియా, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై వారు విచాక్షణారహింతగా దాడులు చేశారు. ఆసుపత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై వైద్యులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. చెనై,తిరుపతి జాతీయరహదారిపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ సెంథిల్ కుమార్ వైద్యులతో చర్చలు జరిపారు.
వెద్యులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు, వైద్యశాల వద్ద పోలీసుల బందోబస్తును పెంచుతామని వారు హమీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.ఇది ఇలా వుండగా గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీసుల బలాగాలను రప్పించారు. ఇదిలా ఉండగా కమలనాథన్ బంధువుల దాడిలో ఎస్.ఐలు కన్నన్, ఇరుడి కేశవన్, అన్నాదురై, ఇన్పెక్టర్ హరికృష్ణతో పాటు పలువురు గాయపడ్డారు. వీరిలో అన్నాదురై పరిస్థితి విషమంగా మారడంతో అతనిని చెన్నై వైద్యశాలకు తరలించారు.
Advertisement