దర్శకురాలు దివ్యభారతికి బెదిరింపులు
చెన్నై: భారతీయ జనతా పార్టీ, పుదియతమిళగం పార్టీలకు చెందిన వారు తనను చంపుతామని బెదిరిస్తున్నారని లఘు చిత్ర దర్శకురాలు దివ్యభారతి ఆరోపించారు. మధురై, ఆణైయూర్‌కు చెందిన ఆమె లెనినిస్ట్ సంఘంలో పనిచేస్తున్నారు. 2009లో లా కాలేజీ విద్యార్థి సురేశ్ పాము కాటుకు గురై మృతి చెందాడు. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని దివ్యభారతి మధురై ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పోరాటం చేసిన కేసులో గత వారం అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఉదయం మాట్లాడుతూ కొన్ని రోజులుగా తనకు హత్యా బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. విదేశాల నుంచి కూడా ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.
తాను నిర్మించిన కక్కూస్ లఘు చిత్రాన్ని తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వీరి గురించి విచారిస్తే భారతీయ జనతా పార్టీ, పుదియతమిళం పార్టీ నేత కృష్ణస్వామికి చెందిన వాళ్లమని చెబుతున్నారన్నారు. అయితే వారెవరన్నది పోలీసులు తేల్చాలని కోరారు. అలాంటి వారికి కృష్ణస్వామి బుద్ది చెప్పాలన్నారు. కక్కూస్ చిత్రంపై కృష్ణస్వామి కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలి సిందని, ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. పశుమాంసం ఇతి వృత్తంగా లఘు చిత్రాన్ని రూపొందింస్తురన్నందుకే భారతీయ జనతా పార్టీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భావించాల్సి వస్తోందని ఆమె అన్నారు.