తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి
తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి
కొరుక్కుపేట,
విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను, ఉపాధ్యాయుల ఆంక్షాంక్షలను నెరవేర్చాలని కేవీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత కేవీ తిరుపతయ్య పేర్కొన్నారు.
చెన్నై విల్లివాక్కంలోని శ్రీ కనకదుర్గా మహోన్నత పాఠశాల (ఎస్‌కేడీటీ) 67వ వార్షికోత్సవాన్ని పాఠశాల ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల అధ్యక్షులు ప్రముఖ డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యూరు.
ఆయన మా ట్లాడుతూ ప్రతి విద్యార్థీ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకున్నప్పుడే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందాన్ని పొందుతారని తెలిపారు. పాఠశాల అధ్యక్షులు సీఎంకె రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ సి.మోహన్‌రెడ్డి, తెలుగు అభివృద్ధికి, తెలుగు విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా మార్చి 16న జరగబోయే ముప్పేరం విళాను సీఎంకేరెడ్డి బాధ్యతగా తీసుకుని తెలుగు వారి సత్తాను చాటాలని కోరారు. సీఎంకే రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రేతర ప్రాంతంలో తెలుగు పాఠశాలను ఏర్పాటు చేసుకుని 67 ఏళ్లుగా తెలుగు విద్యార్థుల కోసం పాటుపడుతున్నామని తెలిపారు.
మాతృభాష మీద భక్తికి, గౌరవానికి శ్రీ కనకదుర్గ పాఠశాల నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మార్చి 16న నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న ముప్పేరం విళాలో తెలుగు వారందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
దక్షిణ భారత వైశ్య మండలి అధ్యక్షుడు ఎం.సి.నారాయణగుప్త మాట్లాడుతూ కనకదుర్గ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు ఆటపాటలలోను ప్రతిభ చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సన్ టీవీ ఫేం చలన చిత్ర నిర్మాత, నటుడు మెర్క్యురీ సత్య, నటీమణి విదర్ష, జయశీల, డాక్టర్ సి.మోహనరెడ్డి ఉత్తమ ప్రతిభకనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
కేవీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కె.వి.తిరుపతయ్య పాఠశాలకు వాటర్ ప్యూర్‌ఫైర్ పరికరాన్ని విరాళంగా అందచేస్తామని చెప్పారు. అదే విధంగా మెర్క్యురీ సత్య పాఠశాలలో మంచి మార్కులు సాధిం చిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేఎల్‌వీ ప్రసాదరావు పట్నాయక్, ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు ఎం.నిర్మల పదవీ విరమణ పొం దగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కేక పుట్టించాయి.