tirupataiah
-
గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
లింగాల: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో చోటుచేసు కుంది. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామానికి చెందిన ఉప్పరి తిరుపతయ్య (55) ఆదివారం లింగాల మండలంలోని అప్పాయ పల్లిలో బంధువుల ఇంటికి వచ్చాడు. లింగాలలో ఉన్న బజ్జీల బండి దగ్గర ఉడకబెట్టిన గుడ్డు తీసుకున్నాడు. అప్పాయపల్లి వెళ్లే మార్గంలో ఉన్న కమాన్ దగ్గర కూర్చొని గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందాడు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం బంధువులకు సమాచారం అందించి వారికి మృతదేహాన్ని అప్పగించారు. తిరుపతయ్య భార్య లక్ష్మమ్మ మూడేళ్ల క్రితం మృతిచెందగా ముగ్గురు కుమారులు ఉన్నారు. -
రెచ్చిపోయిన దొంగలు
పామూరు : పామూరులో ముగ్గురు దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం వేకువజామున స్థానిక నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న అయ్యప్పనగర్‌లోని ఓ ఇంటి తలుపులను రోకలి బండలతో పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న దంపతులపై దాడిచేసి మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ట్రాన్స్పోర్ట్ వ్యాపారి మిరియం తిరుపతయ్య, భార్య దుర్గ, కుమార్తె మాన్యతో కలిసి అయ్యప్పనగర్‌లోని ఇంట్లో బెడ్రూంలో నిద్రిస్తున్నాడు. వేకువజామున 3.30 గంటల సమయంలో ముగ్గురు దొంగలు మొహాలకు మాస్కులు ధరించి రోకలి బండలతో ఇంటి తలుపులు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ శబ్దానికి తిరుపతయ్య దంపతులు, కుమార్తె నిద్రలేస్తుండగానే బెడ్రూం తలుపులు కూడా పగులకొట్టి వారివద్దకు చేరుకుని దాడిచేశారు. దొంగలను అడ్డుకోబోయిన తిరుపతయ్య తలపై రోకలిబండతో రెండుసార్లు బలంగా కొట్టడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బీరువా తాళాలు తీయాలంటూ మరో దుండగుడు దుర్గను బెదిరించగా ఆమె భయంతో బెడ్రూంలోని బీరువా వద్దకు వెళ్తుండగా తిరుపతయ్య పెద్దగా కేకలు వేశాడు. దీంతో దుర్గ మెడలో ఉన్న ఆరు సవర్ల బంగారు గొలుసును లాక్కుని దొంగలు పరారయ్యారు. తిరుపతయ్య వెంటనే బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా వారు బయటకు రాకుండా దొంగలు ముందుగానే సమీపంలోని అన్నీ ఇళ్ల తలుపులకు బయటివైపు గొళ్లేలు వేసి తీగచుట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. స్థానిక ఎస్సై ఎన్.చెంచుప్రసాద్ క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలం రూబీ ఇంటి నుంచి సమీపంలోని ఎస్టీకాలనీలోకి వెళ్లి ఆగింది. సంఘటనపై కేసు నమోదుచేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు. -
కన్నబిడ్డే బరువయ్యాడు
చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పావు చూపుడు వేలు పట్టుకొని ఈ ప్రపంచాన్నే చూపించావు నీ తొలి అడుగే నా అడుగు జాడ అనుకున్నాను నీ ఊపిరే నా జీవితంగా భావించాను కానీ ఇదేమిటి నాన్నా ... ఇలా చేశావు... నా ఊపిరాగితే ... తలకొరివి పెట్టేవారెవురు కొడుకా అని ఆక్రందనతో అల్లాడిపోతావనుకుంటే... నిర్దయగా ... నిర్థాక్షిణ్యంగా అనాథ శవంలా ... నడిబజారులో ఇలా.. నిజంగా నా ఆత్మకు గుండెకోతే తండ్రీ పామూరు : కన్నబిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. తాము ఎలాపోయినా పర్వాలేదు..తమ పిల్లలు మాత్రం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. కానీ, ఓ తండ్రికి మాత్రం కన్న కొడుకే బరువయ్యాడు. అనారోగ్యంతో ఉన్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందడంతో.. ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటో బాడుగ ఎక్కువగా అడిగారని అక్కడే వదిలేసి వెళ్లాడు. ఈ సంఘటన మంగళవారం పామూరు పట్టణంలో వెలుగుచూసింది. సీఎస్ పురం మండలం పిల్లిపల్లి గ్రామానికి చెందిన జయంపు తిరుపతయ్య కుమారుడు మహాలక్ష్మయ్య (17) తండ్రితో కలిసి బొగ్గు కాల్చేపనికి వెళ్తుంటాడు. కాగా, సోమవారం రాత్రి మహాలక్ష్మయ్యకు అకస్మాత్తుగా తలనొప్పి వచ్చింది. దీంతో తిరుపతయ్య పామూరులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించాడు. అయినప్పటికీ తగ్గకపోవడంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత స్థానిక నెల్లూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స చేస్తుండగా మహాలక్ష్మయ్య మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటో మాట్లాడబోగా, బాడుగ ఎక్కువగా అడిగారు. దీంతో కన్నకొడుకని కూడా పట్టించుకోకుండా మహాలక్ష్మయ్య మృతదేహాన్ని ఆస్పత్రి సమీపంలోని సీపీఐ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ దుకాణం వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని చూసి ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్సై ఎన్.చెంచుప్రసాద్ విచారణ చేపట్టి వివరాలు తెలుసుకుని తిరుపతయ్యను పిలిపించి ప్రశ్నించగా.. ఆటో బాడుగ కట్టలేక వదిలేసి వెళ్లానని చెప్పాడు. దీంతో పోలీసులే ఓ వాహనం మాట్లాడి మృతదేహాన్ని పిల్లిపల్లి గ్రామానికి తరలించారు. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే విలవిల్లాడాల్సిన తండ్రి.. ఆటో బాడుగ కట్టలేక మృతదేహాన్ని కఠినంగా రోడ్డుపై వదిలేసి వెళ్లడం స్థానికులను కలచివేసింది. -
తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి
తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి కొరుక్కుపేట, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను, ఉపాధ్యాయుల ఆంక్షాంక్షలను నెరవేర్చాలని కేవీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత కేవీ తిరుపతయ్య పేర్కొన్నారు. చెన్నై విల్లివాక్కంలోని శ్రీ కనకదుర్గా మహోన్నత పాఠశాల (ఎస్‌కేడీటీ) 67వ వార్షికోత్సవాన్ని పాఠశాల ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల అధ్యక్షులు ప్రముఖ డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఆయన మా ట్లాడుతూ ప్రతి విద్యార్థీ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకున్నప్పుడే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందాన్ని పొందుతారని తెలిపారు. పాఠశాల అధ్యక్షులు సీఎంకె రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ సి.మోహన్‌రెడ్డి, తెలుగు అభివృద్ధికి, తెలుగు విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా మార్చి 16న జరగబోయే ముప్పేరం విళాను సీఎంకేరెడ్డి బాధ్యతగా తీసుకుని తెలుగు వారి సత్తాను చాటాలని కోరారు. సీఎంకే రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రేతర ప్రాంతంలో తెలుగు పాఠశాలను ఏర్పాటు చేసుకుని 67 ఏళ్లుగా తెలుగు విద్యార్థుల కోసం పాటుపడుతున్నామని తెలిపారు. మాతృభాష మీద భక్తికి, గౌరవానికి శ్రీ కనకదుర్గ పాఠశాల నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మార్చి 16న నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న ముప్పేరం విళాలో తెలుగు వారందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారత వైశ్య మండలి అధ్యక్షుడు ఎం.సి.నారాయణగుప్త మాట్లాడుతూ కనకదుర్గ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు ఆటపాటలలోను ప్రతిభ చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సన్ టీవీ ఫేం చలన చిత్ర నిర్మాత, నటుడు మెర్క్యురీ సత్య, నటీమణి విదర్ష, జయశీల, డాక్టర్ సి.మోహనరెడ్డి ఉత్తమ ప్రతిభకనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కేవీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కె.వి.తిరుపతయ్య పాఠశాలకు వాటర్ ప్యూర్‌ఫైర్ పరికరాన్ని విరాళంగా అందచేస్తామని చెప్పారు. అదే విధంగా మెర్క్యురీ సత్య పాఠశాలలో మంచి మార్కులు సాధిం చిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తామని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేఎల్వీ ప్రసాదరావు పట్నాయక్, ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు ఎం.నిర్మల పదవీ విరమణ పొం దగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కేక పుట్టించాయి. -
వివాహిత దారుణ హత్య
తాడిపత్రి రూరల్, న్యూస్‌లైన్: తాడిపత్రి మండలంలోని భోగసముద్రం గ్రామంలో సరిత(20) అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా హసన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య ఐదేళ్లుగా స్థానిక ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లోని లోడింగ్ సెక్షన్లో పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తన సొంత ప్రాంతానికి చెందిన సరితను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్య, తన తమ్ముడితో కలిసి భోగసముద్రంలో నివాసం ఉంటూ విధులకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తిరుపతయ్య యథావిధిగా ఫ్యాక్టరీకి వెళ్లాడు. రోజూలాగే విధులు ముగించుకుని సోమవారం తెల్లవారు జామున ఇంటికి చేరాడు. తలుపు తెరిచే ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా, సరిత రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తలపై ఎవరో బండరాయితో మోది హత్య చేశారు. రూరల్ సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మరిది ప్రేమ వ్యవహారమే కారణమా? సరితను ఎవరైనా బంగారం కోసం హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మరిది ప్రేమ వ్యవహారమే ఆమె ప్రాణం తీసిందనే అనుమానం వ్యక్తం అవుతోంది. తిరుపతయ్యతో పాటు లోడింగ్ సెక్షన్లో పని చేసే పోచయ్య కూతురుతో సరిత మరిది రమేష్ స్నేహంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయంలో రమేష్‌ను పోచయ్య హెచ్చరించినట్లు తెలిసింది. అయితే సరిత తన మరిదిని ప్రోత్సహిస్తుండటంతో పోచయ్య కక్ష పెంచుకుని ఆమెను హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోచయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.