కన్నబిడ్డే బరువయ్యాడు
చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పావు
చూపుడు వేలు పట్టుకొని
ఈ ప్రపంచాన్నే చూపించావు
నీ తొలి అడుగే
నా అడుగు జాడ అనుకున్నాను
నీ ఊపిరే నా జీవితంగా భావించాను
కానీ ఇదేమిటి నాన్నా ... ఇలా చేశావు...
నా ఊపిరాగితే ...
తలకొరివి పెట్టేవారెవురు కొడుకా అని
ఆక్రందనతో అల్లాడిపోతావనుకుంటే...
నిర్దయగా ... నిర్థాక్షిణ్యంగా
అనాథ శవంలా ... నడిబజారులో ఇలా..
నిజంగా నా ఆత్మకు గుండెకోతే తండ్రీ
పామూరు : కన్నబిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. తాము ఎలాపోయినా పర్వాలేదు..తమ పిల్లలు మాత్రం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. కానీ, ఓ తండ్రికి మాత్రం కన్న కొడుకే బరువయ్యాడు. అనారోగ్యంతో ఉన్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందడంతో.. ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటో బాడుగ ఎక్కువగా అడిగారని అక్కడే వదిలేసి వెళ్లాడు. ఈ సంఘటన మంగళవారం పామూరు పట్టణంలో వెలుగుచూసింది. సీఎస్ పురం మండలం పిల్లిపల్లి గ్రామానికి చెందిన జయంపు తిరుపతయ్య కుమారుడు మహాలక్ష్మయ్య (17) తండ్రితో కలిసి బొగ్గు కాల్చేపనికి వెళ్తుంటాడు. కాగా, సోమవారం రాత్రి మహాలక్ష్మయ్యకు అకస్మాత్తుగా తలనొప్పి వచ్చింది. దీంతో తిరుపతయ్య పామూరులోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించాడు.
అయినప్పటికీ తగ్గకపోవడంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత స్థానిక నెల్లూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స చేస్తుండగా మహాలక్ష్మయ్య మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటో మాట్లాడబోగా, బాడుగ ఎక్కువగా అడిగారు. దీంతో కన్నకొడుకని కూడా పట్టించుకోకుండా మహాలక్ష్మయ్య మృతదేహాన్ని ఆస్పత్రి సమీపంలోని సీపీఐ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ దుకాణం వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని చూసి ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్సై ఎన్.చెంచుప్రసాద్ విచారణ చేపట్టి వివరాలు తెలుసుకుని తిరుపతయ్యను పిలిపించి ప్రశ్నించగా.. ఆటో బాడుగ కట్టలేక వదిలేసి వెళ్లానని చెప్పాడు. దీంతో పోలీసులే ఓ వాహనం మాట్లాడి మృతదేహాన్ని పిల్లిపల్లి గ్రామానికి తరలించారు. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే విలవిల్లాడాల్సిన తండ్రి.. ఆటో బాడుగ కట్టలేక మృతదేహాన్ని కఠినంగా రోడ్డుపై వదిలేసి వెళ్లడం స్థానికులను కలచివేసింది.