ల్యాబో దిబో!
అనంతపురంలో స్నేహిత(6) అనే చిన్నారికి తీవ్ర జ్వరం సోకింది. చికిత్స కోసం వారి తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తంలో తెల్ల కణాలు భారీగా తగ్గి 39 వేలు మాత్రమే ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టు ఇచ్చారు. దీంతో వైద్యులు బెంగళూరుకు సిఫార్సు చేశారు. అక్కడికి వెళ్లి రక్త పరీక్షలు చేరుుస్తే రక్త కణాలు సాధారణ స్థితిలో ఉన్నట్లు రిపోర్టు వచ్చింది.
అనంతపురంలో సీటీ స్కాన్‌కు రూ. 2 వేలు తీసుకుంటున్నారు. ఎంఆర్‌ఐ (లంబర్ స్కాన్)కి రూ.5,500 నుంచి 6 వేలు తీసుకుంటున్నారు. పొరుగునే ఉన్న కర్నూలులో సీటీ స్కాన్‌కు రూ.1200, ఎంఆర్‌ఐ (లంబర్ స్కాన్)కి 3,500-4 వేలు తీసుకుంటున్నారు. ఒకే రకమైన పరీక్షలకు ఇంత తేడా ఎందుకు ఉందని ఆరా తీస్తే.. ‘అనంత’లో వైద్యులకు ల్యాబ్‌ల యజమానులు 50 శాతం కమీషన్ ముట్టజెప్పడమే.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి విష జ్వరాల నిర్ధారణకు నిర్వహిస్తున్న పరీక్షలు రోగుల్ని కలవరపెడుతున్నాయి. ఒక ల్యాబ్‌కు, ఇంకో ల్యాబ్‌కు రిపోర్టులు భిన్నంగా ఉంటున్నాయి. ఏ ల్యాబ్ రిపోర్టు కరెక్టో తెలీక రోగులు రెండు మూడు చోట్ల పరీక్షలు చేరుుస్తూ ఆందోళన చెందుతున్నారు. సరైన శిక్షణ, నైపుణ్యం లేని టెక్నీషియన్ల వల్ల రిపోర్టులు తప్పుల తడకగా వస్తున్నాయి. ఇలాంటి పరీక్షలకు వేలకు వేల రూపాయలు ల్యాబ్‌ల్లో లాగుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందక, తప్పని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు బాట పట్టాల్సి వస్తోంది. డబ్బు పోరుునా ఫరవాలేదని అక్కడికి వెళితే తప్పుడు రిపోర్టులతో ఆందోళన పెరిగిపోతోందని రోగులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్లు ఎక్కడ?
జిల్లాలో చాలా ప్రైవేటు ఆస్పత్రులలో ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. వీటిలో చాలా ల్యాబ్ లకువైద్య, ఆరోగ్య శాఖ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ లేకుండానే ల్యాబ్‌లను నడుపుతున్నారు. ఎంఎల్‌టీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) చేసిన నిపుణులైన టెక్నీషియన్లు లేరు. ఎంఎల్‌టీ చేసిన ఓ వ్యక్తి పేరుతో అనుమతి తెచ్చుకుని, అరకొర పరీక్షలు చేయడం నేర్చుకున్న్ఙల్యాబ్ బాయ్స్’తో పరీక్షలు చేయిస్తున్నారు. దీంతోనే తప్పుడు రిపోర్టులు వస్తున్నాయి. జిల్లాలో ఇలాంటి పరిస్థితి తరచూ ఎదురవుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ల్యాబ్‌లపై తరచూ తనిఖీలు చేపట్టడం, అనుమతులు లేని వాటిని సీజ్ చేయడం జరగడం లేదు. దీంతోపాటు జిల్లాలోని కొంత మంది ప్రైవేటు వైద్యులు కూడా కాసులకు ఆశపడి ఎక్కువ కమీషన్ ఇచ్చే ల్యాబ్‌లకు రిపోర్టులు రాసిస్తున్నారు. ల్యాబ్ బిల్లు మొత్తంలో 50 శాతం డాక్టర్లకు కమిషన్ ఇస్తున్నారంటే ల్యాబ్‌ల దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది.
పెద్ద ఆస్పత్రుల నుంచి భారీ కమీషన్లు
డెంగీ, విష జ్వరాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా, అధికారుల్లో అప్రమత్తత కొరవడింది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 28 మంది డెంగీతో చనిపోయారు. వైద్య శాఖ మాత్రం ఒక్క డెంగీ మరణం కూడా లేదంటోంది. మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి విష జ్వరాలు ముసురుకుంటున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు వైద్యులు జ్వరం, ఒళ్లునొప్పులనగానే డెంగీ లక్షణాలంటూ భయపెడుతున్నారు. ఇక్కడ పరీక్షల నిమిత్తం 700-1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఖర్చుకు వెనకాడరని తెలిస్తే కర్నూలు, బెంగళూరు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ‘అనంత’నుంచి సిఫార్సు చేసిన డాక్టర్లకు అక్కడి ఆస్పత్రుల నుంచి కమిషన్లు అందుతున్నట్లు తెలుస్తోంది.
వెయ్యి రూపాయల వరకు వసూళ్లు
ప్రస్తుతం జిల్లాలో కొన్ని రక్త పరీక్ష కేంద్రాల్లో ర్యాపిడ్ కిట్ సాయంతో డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయ వైరాలజీ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఎలీసా పరీక్షలో నిర్దారణ అయితేనే డెంగీగా పరిగణించాలి. ఇది కేవలం జిల్లాలో ‘అనంత’తో పాటు మరో రెండు ప్రైవేటు వైద్యశాలల్లో మాత్రమే ఉంది. అయితే కొందరు ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులు వైద్యుల కనుసన్నల్లో ప్రత్యేక కిట్ల ద్వారా నామమాత్రపు పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు 200 వసూలు చేయాల్సి ఉండగా, 1500 రూపాయల వరకు గుంజుతున్నారు. జనరల్ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్ కౌంటింగ్ మిషన్ ఉంది. అయితే అక్కడ రక్తపరీక్షలకు వినియోగించే కెమికల్స్ అయిపోవడం, ల్యాబ్ సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, మిషన్లు చెడిపోతే సకాలంలో మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. మూత్రం, రక్త పరీక్షల శాంపిల్స్ తారుమారు కావడం వల్ల తరచూ పొరపాట్లు చోటుచేసుకుంటున్నారుు. ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నారుు.
డెంగీ లక్షణాలు ఇలా
డెంగీ జ్వరం వల్ల తలనొప్పి, కంటి వెనుక నొప్పి, కండరాల నొప్పులతో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంటే ముక్కు, నోరు, చిగుళ్ల వెంట రక్తం రావడం, వాంతులు, మలం నల్లగా ఉండటం, నిద్రలేమి, శ్వాసలో ఇబ్బంది, పొత్తి కడపునొప్పి, నాలుక తడారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. చికున్ గున్యా, మలేరియా జ్వర లక్షణాలున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది.
డెంగీ బారిన పడిన వారికి ఇవి మరింత తగ్గుతాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉండి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలి. రక్తస్రావం లేకున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య బాగాతగ్గిపోతే వెంటనే స్పందించాలి. రక్తంలో ప్లాస్మా తగ్గుతుందేమో పరీక్షించుకోవాలి. డెంగీ జ్వరాల్లో రక్తంలోని ప్లాస్మా లీక్ అవుతుంది. ఇది ప్రమాదకరం. ప్లాస్మా లీకవడం వల్ల రక్తం చిక్కబడుతుంది. బీపీ కూడా తగ్గుతుంది. దీంతో పాటు రక్తకణాలు లక్షకన్నా తగ్గి ప్యాక్‌డ్ సెల్ వాల్యూ (పీసీవీ) ఉండాల్సిన దానికంటే 20 శాతం పెరిగితే రక్తస్రావం లేకున్నా డెంగీగా భావించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పరీక్షల్లో తేడా వస్తోంది
- డాక్టర్ వెంకటేశ్వరరావు,
సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి,
అనంతపురం.
డెంగీతో పాటు చాలా రోగాల రక్త పరీక్షల్లో తప్పులు దొర్లుతున్నాయనే విషయం నా దృష్టికి కూడా వచ్చింది. కొన్ని ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించకుండానే టూకీగా లెక్కలు వేసి పంపుతున్నారు. బెంగళూరు, కర్నూలుకు వెళ్లినపుడు అక్కడ వాస్తవం తేలుతోంది. దీంతోపాటు నిపుణులైన టెక్నీషియన్లు లేరు. కెమికల్స్ వినియోగంలో కూడా కొన్ని చోట్ల తప్పులు దొర్లుతున్నాయి. అలాం టప్పుడు మళ్లీ రక్తం తీసుకుని పరీక్ష చేయాలి. కానీ చాలా మంది మమ అనిపిస్తున్నారు. ఇది కరెక్టు కాదు. రిపోర్టులు కచ్చితంగా ఇవ్వాలి.