రెచ్చిపోయిన దొంగలు | theft in tirupataiah house | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన దొంగలు

Published Wed, Oct 22 2014 1:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

రెచ్చిపోయిన దొంగలు - Sakshi

రెచ్చిపోయిన దొంగలు

పామూరు : పామూరులో ముగ్గురు దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం వేకువజామున స్థానిక నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న అయ్యప్పనగర్‌లోని ఓ ఇంటి తలుపులను రోకలి బండలతో పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న దంపతులపై దాడిచేసి మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి మిరియం తిరుపతయ్య, భార్య దుర్గ, కుమార్తె మాన్యతో కలిసి అయ్యప్పనగర్‌లోని ఇంట్లో బెడ్‌రూంలో నిద్రిస్తున్నాడు. వేకువజామున 3.30 గంటల సమయంలో ముగ్గురు దొంగలు మొహాలకు మాస్కులు ధరించి రోకలి బండలతో ఇంటి తలుపులు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ శబ్దానికి తిరుపతయ్య దంపతులు, కుమార్తె నిద్రలేస్తుండగానే బెడ్‌రూం తలుపులు కూడా పగులకొట్టి వారివద్దకు చేరుకుని దాడిచేశారు.

దొంగలను అడ్డుకోబోయిన తిరుపతయ్య తలపై రోకలిబండతో రెండుసార్లు బలంగా కొట్టడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బీరువా తాళాలు తీయాలంటూ మరో దుండగుడు దుర్గను బెదిరించగా ఆమె భయంతో బెడ్‌రూంలోని బీరువా వద్దకు వెళ్తుండగా తిరుపతయ్య పెద్దగా కేకలు వేశాడు. దీంతో దుర్గ మెడలో ఉన్న ఆరు సవర్ల బంగారు గొలుసును లాక్కుని దొంగలు పరారయ్యారు. తిరుపతయ్య వెంటనే బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా వారు బయటకు రాకుండా దొంగలు ముందుగానే సమీపంలోని అన్నీ ఇళ్ల తలుపులకు బయటివైపు గొళ్లేలు వేసి తీగచుట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. స్థానిక ఎస్సై ఎన్.చెంచుప్రసాద్ క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలం రూబీ ఇంటి నుంచి సమీపంలోని ఎస్టీకాలనీలోకి వెళ్లి ఆగింది. సంఘటనపై కేసు నమోదుచేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement