సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రచార భేరీ మోగించనున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరతో కలసి ఆదివారం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తొలుత బళ్లారిలో పార్టీ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణ తరఫున ప్రచారం చేస్తారు. తదుపరి శివమొగ్గ జిల్లాలోని శికారిపుర, బెల్గాం జిల్లాలోని చిక్కోడి-సదలగలలో ప్రచారాన్ని నిర్వహిస్తారు.
సీఎం, పరమేశ్వరలతో పాటు ఆయా నియోజక వర్గాలకు ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటారు. శికారిపుర నుంచి శాంత వీరప్ప గౌడ, చిక్కోడి-సదలగ నుంచి గణేశ్ హుక్కేరిలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నందున ఈ మూడు స్థానాల్లో ఆరు నూరైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. మరో వైపు పార్టీకి గట్టి పట్టు ఉన్న బళ్లారి గ్రామీణ, శికారిపుర స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడానికి కమలనాథులు కూడా గట్టిగానే కృషి చేస్తున్నారు.
ఈ రెండింటిలో కాంగ్రెస్ తమకు ఎలాంటి పోటీ ఇవ్వలేదని వారు లోలోపల విశ్వాసంతో ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నందున తాయిలాల ఆశ చూపెట్టి కాంగ్రెస్ ఎగుర వేసుకు పోతుందనే ఆందోళన కూడా వారిలో లేకపోలేదు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్.
ఈశ్వరప్ప, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌లు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. కాగా శ్రీరాములు, యడ్యూరప్పలతో పాటు ప్రకాశ్ హుక్కేరి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ప్రకాశ్ సిద్ధరామయ్య మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు పోటీ చేస్తున్నారు.
ఉప ఎన్నికల ప్రచార భేరి
Published Sun, Aug 10 2014 2:55 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement