తమిళనాడులో ఉప ఎన్నికలకు షెడ్యూల్
చెన్నై: తమిళనాడులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో ఈసీ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో మరో స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాలన వ్యవహారాలను మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఎవరు ఖరారు చేస్తారన్నది తేలాల్సివుంది.