సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వ్యవసాయ ఆధారిత అభివృద్ధి వల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందని, ఇందులో యూపీఏ సర్కారు గొప్పేమీ లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. ఎఫ్‌కేసీసీఐ బుధవారం ఇక్కడ ఓ హోటల్‌లో ‘ముందున్న ఆర్థిక సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడారు. యూపీఏ సర్కారు తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడు 8.4 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు 4.5 శాతానికి దిగజారిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలే దీనికి కారణమని ఆరోపించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వద్ద మార్గదర్శకాలు లేవని విమర్శించారు. దేశంలో తొలకరి వర్షాలు బాగా పడినందున వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగాయని తెలిపారు. వృద్ధి రేటుకు ఇదెంతగానో ఊతమిచ్చిందని చెప్పారు. పెట్టుబడుల ఆధారంగా అభివృద్ధి జరగాలే తప్ప, సబ్సిడీ ఇచ్చుకుంటూ పోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
అవసరమైన సబ్సిడీలు ఇవ్వడం అనివార్యమైనప్పటికీ, బడ్జెట్‌లో సబ్సిడీలు పెద్ద పరిమాణంలో ఉంటే దేశ అభివృద్ధి దృష్ట్యా మంచిది కాదని అన్నారు. దేశంలో ఆహారోత్పత్తి మందగించిందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక లోపాలున్నాయని తెలిపారు. 65 శాతం ఆహార ధాన్యాలు పంపిణీకి నోచుకోక గోదాముల్లో మూలుగుతున్నాయని ఆరోపించారు. ఆహార కొరతను నివారిస్తే, ఆర్థిక మాంద్యం కూడా తగ్గుముఖం పడుతుందని అన్నారు.
యూపీఏ సర్కారు హయాంలో రూ.17 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫైళ్లను సకాలంలో పరిష్కరించక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిష్టూరమాడారు. పార్లమెంట్ ఆమోదం లేకుండానే ‘ఆధార్’ను తొలుత నిర్బంధం చేశారని, ఇప్పుడు ఐచ్ఛికమంటున్నారని విమర్శించారు. సబ్సిడీలకు, ఆధార్‌కు లంకె పెట్టడం ఏమాత్రం మంచిది కాదని ఆయన సలహా ఇచ్చారు.
వ్యవసాయంతోనే ఆర్థిక వృద్ధి
Published Thu, Feb 27 2014 2:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement