
సీబీఐ ఎదుట కార్తీ
♦ మళ్లీ విచారణ
♦ చిదంబరం వర్గంలో ఉత్కంఠ
సాక్షి, చెన్నై : కార్తీని పదే పదే సీబీఐ విచారిస్తుండడంతో, ఆయన్ను అరెస్టు చేస్తారేమోనని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. ఐఎన్‌ఎక్స్ మీడియాకు అనుమతుల వ్యవహారంలో సాగిన లావాదేవీలో కార్తీ ప్రమేయం నిగ్గు తేల్చే పనిలో సీబీఐ నిమగ్నం అయింది. సోమవారం మరోమారు కార్తీ విచారణకు హాజరు కావడం గమనార్హం.
రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న చిదంబరం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. ఆయనకు తమిళనాట మద్దతుదారులే ఎక్కువే. ఇటీవల కాలంగా ఆయన కుటుంబాన్ని సీబీఐ చట్టుముడుతోంది. శారదా చిట్ ఫండ్ కేసులో ఆయన సతీమణి నళిని చిదంబరం ప్రమేయం ఉన్నట్టు ఓ వైపు , మరో వైపు ఆయన తనయుడు కార్తీ చిదంబరంను ఐఎన్‌ఎక్స్ మీడియా, వాసన్ హెల్త్ కేర్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక వ్యవహారాలు చుట్టుముట్టి ఉన్నాయి. ముంబయికి చెందిన ఇంద్రాణి ముఖర్జీ , ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీలకు చెందిన ఐఎన్‌ఎక్స్ టీవీ మీడియాకు అనుమతి వ్యవహారం చిదంబరం కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టే అస్త్రాలుగా ఈడీకి మారడంతో ఓ వైపు దాడుల్ని, మరో వైపు విచారణల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు సాగినా, వాంటెడ్ జాబితాలో పేరు ఎక్కడంతో గత్యంతరం లేని పరిస్థితి. నకిలీ కంపెనీలను సృష్టించడం, ఐదు కంపెనీల పేరుతో విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించి ఉండడం, మరో రెండు కంపెనీలకు ఎలాంటి రికార్డులు లేకున్నా, భారీగా రుణాలు సమకూర్చడం, ఆ చానల్‌కు అనుమతి ఇవ్వడం వెరసి కార్తీ మెడకు ఉచ్చుగా మారాయి. సీబీఐ విచారణల్ని వరుసగా కార్తీ ఎదుర్కొంటుండడంతో ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేస్తారేమోనన్న చిదంబరం మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.
గత వారం ఢిల్లీలో సీబీఐ ఎదుట విచారణకు కార్తీ హాజరు అయ్యారు. ప్రస్తుతం సోమవారం మరోమారు ఆయన హాజరు కావడం, సీబీఐ తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ తప్పడం లేదు.