సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గం టల్లో తెర పడనున్నది. దీంతో ఆగమేఘాలపై అభ్యర్థులు ఓట్ల వేటలో మునిగారు. సరిగ్గా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసేలా ఈసీ కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయింది. బయటి వ్యక్తుల్ని నియోజకవర్గాల నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంది. ఇక, సోమవారం తన ఎన్నికల ప్రచారాన్ని సీఎం జయలలిత ముగించారు. టీ నగర్ వేదికగా అభ్యర్థులందరినీ ఓటర్లకు పరిచయం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు సమీపించింది. ఒంటరి పయనాలతో తమసత్తాను చాటుకునే పనిలో అన్నాడీఎంకే, కాం గ్రెస్‌లు ముందుకు కదిలాయి. డీపీఏ కూటమిగా డీఎంకే, ఎన్డీఏ కూటమిగా బీజేపీ బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లు పుదుచ్చేరితోపాటుగా రాష్ట్రంలో 40 స్థానాల్లో అభ్యర్థులను దించాయి.
డీఎంకే 35 స్థానాల్లో, ఆ కూటమిలోని మిత్రులు ఐదు స్థానాల్లో అభ్యర్థులను దించారు. బీజేపీ 8 చోట్ల, ఆ కూటమిలోని డీఎండీకే 14 స్థానాల్లో, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కొముకాలు తలా ఓ చోట అభ్యర్థులను రంగంలోకి దించాయి. పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్ల వేటలో రాజకీయ పక్షాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. తమ అభ్యర్థులకు మద్దతుగా సీఎం జయలలిత ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ పార్టీకి మద్దతుగా నటీ నటులు అనేక మంది ప్రచారంలో కదిలారు. తమ అభ్యర్థులకు మద్దతుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. పార్టీ అధినేత కరుణానిధి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. డీఎంకే కూటమికి మద్దతుగా మిత్ర పక్షాల నేతలు, పార్టీల నాయకులు, సినీ నటీ నటులు రోడ్ షోల రూపంలో అలరించారు.
కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్ తలా ఓ చోట ప్రచార సభలతో అటు కన్పించి, ఇలా మాయం అయ్యారు. తమ మద్దతు దారులను గెలిపించుకోవడం లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్లు చిదంబరం, జికే వాసన్, ఈవీకేఎస్ తదితరులు తీవ్రంగానే కుస్తీలు పట్టారు. బీజేపీ కూటమికి మద్దతుగా ఆ పార్టీ పీఎం అభ్యర్థి నరేంద్ర మోడీ, సీనియర్లు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, గడ్కారీలు ప్రచారంలో మెరిశారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల కోసం ఓటర్ల వద్దకు వెళ్లే, ఆ కూటమిలోని వైగో, రాందాసులు తమ అభ్యర్థులు బరిలో ఉన్న చోటకే పరిమితం అయ్యారు. సీపీఎం, సీపీఐలకు మద్దతుగా ఆ పార్టీల జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్, సీతారామం ఏచూరి, రాజాలు కార్మికులను ఆకర్షించే యత్నం చేశారు. రేయింబవళ్లు సాగిన ప్రచార హోరు మరి కొన్ని గంటల్లో ముగియనున్నది.
దీంతో చివరి రోజు ఆగమేఘాలపై ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పక్షాల అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ప్రచారం ముగించిన జయలలిత: అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఎన్నికల ప్రచారాన్ని ఒక రోజు ముందుగానే ముగించారు. సోమవారం సాయంత్రం టీ నగర్ వేదికగా జరిగిన సభలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముందుగా తమ పార్టీ అభ్యర్థులు 40 మందిని ఆగమేఘాలపై చెన్నైకు రావాలని ఆదేశించారు. దీంతో విమానాల్లో ఎక్కి చెన్నైలో అభ్యర్థులు వాలారు. అందరినీ పోయేస్ గార్డెన్‌కు పిలిపించి మంతనాల్లో మునిగారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లు సైతం సమావేశానికి పిలిపించడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది.
ఎన్నికలకు ఒక రోజు మాత్రమే సమయం ఉన్న వేళ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రం టీ నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులందరినీ ఒకే వేదిక మీదకు పిలిపించి ఓటర్లకు పరిచయం చేశారు. ఇంత వరకు అభ్యర్థులు వేదిక మీదకు పిలిపించి జయలలిత ప్రచారం చేయలేదు. ఇందుకు కారణం తన ఎన్నికల ఖర్చును అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామంటూ ఈసీ హెచ్చరించడమే. దీంతో ప్రచారం ముగించే వేళ అభ్యర్థులందరినీ ఒకే వేదిక మీదకు జయలలిత పిలిపించారు. ఇక, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, స్టాలిన్ మంగళవారం చెన్నైలో ప్రచారం ముగించనున్నారు. ఉత్తర, దక్షిణ, సెంట్రల్ చెన్నైలను కలుపుతూ రోడ్ షోకు కరుణానిధి నిర్ణయించారు. సోమవారం జరిగిన ప్రచార సభలో అన్నాడీఎంకేకు గుణ పాఠం నేర్పుదామని ఓటర్లకు ఆయన పిలుపు నిచ్చారు. డీఎంకేకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
నేడు ఆఖరు : ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో తెర పడనున్నది. దీంతో అన్ని నియోజకవర్గాల్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంది. నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఉన్న నాయకులు, ఆయా ప్రాంతాలకు సంబంధం లేని వ్యక్తులను ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ ఈసీ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా నగదు బట్వాడా అడ్డుకట్టకు డేగ కళ్లతో నిఘా బృందాలు గస్తీని ముమ్మరం చేశాయి. ఓటర్లకు ఓటు విలువ తెలియజేయడం లక్ష్యంగా ఎస్‌ఎంఎస్, ఆన్‌లైన్ ప్రచారానికి నిర్ణయించారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు మైకులు, లౌడ్ స్పీకర్లు, ప్రచార రథాలు ఎక్కడికక్కడే నిలుపుదల చేయకుంటే, కొరడా ఝుళిపించాల్సి ఉంటుందని ఈసీ హెచ్చరించింది.
నేటితో ‘తెర’
Published Tue, Apr 22 2014 12:24 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement