వై'గో'?
ఎన్నికల సంగ్రామంలో ముందుండి నడిపించాల్సిన రథసారధే తప్పుకుంటే... గెలుపు వ్యూహంతో అందరికీ మార్గదర్శనం చేయాల్సిన వ్యక్తే పోటీ నుంచి తప్పుకుంటే. ప్రజా సంక్షేమ కూటమిలో సోమవారం ఇదే జరిగింది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రజా సంక్షేమ కూటమి అధినేత వైగో అకస్మాత్తుగా అస్త్రసన్యాసం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు.
* పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
* వైగో వైఖరిపై నిరసన ప్రదర్శన
* సంకటంలో సంక్షేమ కూటమి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కూటమి నేతలతో కలిసి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోవిల్‌పట్టి నుంచి పోటీ చేయబోతున్నట్లు వైగోనే ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం సో మవారం ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా వైగో నామినేషన్ వేయనున్నట్లే ప్రచారం జరిగింది.
సోమవారం ఉదయం పరిమిత సంఖ్యలో వెన్నంటి వచ్చిన అనుచరులతో కలిసి కోవిల్‌పట్టికి చేరుకున్న వైగో తాను పోటీచేయడం లేదని ప్రకటించడంతో నేతలంతా ఖిన్నులయ్యారు. తన బదులుగా ఎండీఎంకే తూత్తుకూడి జిల్లా యువజన విభాగం కార్యదర్శి వినాయక రమేష్‌తో సోమవారం నామినేషన్ వేయించారు. జాతి, మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న డీఎంకే వైఖరిని నిరసిస్తూ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వైగో తెలిపారు.
పసుంపొన్ ముత్తరామలింగ దేవర్ విగ్రహానికి గత నలభై ఏళ్లుగా మాల వేసి గౌరవిస్తున్నానని, దేవర్ కులస్తులకు తాను అనేక విషయాల్లో అండగా నిలిచినట్లు తెలిపారు. కోవిల్‌పట్టిలో దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నందున అదే కులానికి చెందిన సుబ్రమణియం డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని అన్నారు. తన అభ్యర్థిత్వంతో దేవర్, నాయుడు కులస్తుల మధ్య విద్వేషాలు రగిల్చేం దుకు డీఎంకే సిద్ధమైందని ఆయన ఆరోపించారు.
తన పోటీ కారణంగా దేవర్, నాయుడు సామాజిక వర్గాల మధ్య విభేదాలు రాకూడదని డీఎంకేకు ఆ అవకాశం ఇవ్వకూడదనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని వివరించారు. తమ కూ టమి అభ్యర్థుల విజయానికి పాటుపడతానని చెప్పారు. ఇదిలా ఉండగా, వైగో తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలుకు వెళుతుండగా ఇండియ దేవర్ ఇన మక్కల్ కూటమి కార్యకర్తలు నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. కోవి ల్‌పట్టిలోని దేవర్ విగ్రహానికి మాలవేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మిశ్రమ స్పందన
పోటీ చేయబోవడం లేదంటూ వైగో చేసిన ప్రకటన కూటమిలో మిశ్రమ స్పందన కలిగించింది. అకస్మాత్తుగా ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ పేర్కొన్నారు. తనకే కాదు, కూటమిలోని పార్టీలూ ఆశ్చర్యచకితులైనారని అన్నా రు. వైగో తన నిర్ణయాన్ని మార్చుకుం టారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వైగో నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ అన్నారు. తన గెలుపు కోసం కాక కూట మి గెలుపు కోసం వైగో పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసిన వైగో తన వాక్చాతుర్యం తో దాన్ని ఎంతో బలోపేతం చేశాడు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను గట్టిపోటీ మీద కూటమిలో చేర్చుకున్నాడు. ఎటుపోవాలో తెలియక తంటా లు పడుతున్న తమిళ మానిల కాంగ్రెస్‌ను కూటమిలో భాగస్వామిని చేశాడు. దళిత నేత వీసీకే అధినేత తిరుమావళవన్ అంతకు ముందే కూటమి తీర్థం పుచ్చుకున్నాడు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్‌ను వైగో రంగంలోకి దించాడు. తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాడు.
తూత్తుకూడి జిల్లా కోవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి సోమవారం దాఖలు చేయకుండా చల్లగా తప్పుకున్నాడు. వైగో వైఖరితో సంక్షేమ కూటమి సంకటంలో పడిపోయింది. దేవర్, నాయుడు కులస్తుల మధ్య ఘర్షణలు తలెత్తకూడదన్న కారణంతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా. ఘర్షణలు తలెత్తకూడదన్న కారణంతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా, పోటీకి దూరంగా ఎందుకు (వై), వెళ్లిపోయారు (గో) అనే సందేహాలు తలెత్తుతున్నాయి.