న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ల ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. పోటీలో ఉన్న అన్ని విద్యార్థి యూనియన్లు ప్రచార కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ఈ నెల 12 వ తేదీ ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్‌యూ) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతున్నట్లు డీయూ ప్రధాన ఎన్నికల అధికారి డీఎస్ రావత్ తెలిపారు. విద్యార్థి ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారి ఈవీఎంలను వాడుతున్నట్లు ఆయన వివరించారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద వీలైనన్ని ఎక్కువగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు.
దీంతో పాటు ఎన్నికల ప్రక్రియను రికార్డ్ చేసేందుకు ప్రైవేట్ వీడియోగ్రాఫర్లను సైతం నియమిస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా, ఎన్నికల పోటీచేస్తున్న వివిధ విద్యార్థి సంఘాలు గత శుక్రవారమే ఆయా పోస్టులకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) తమ సంఘం తరఫున మోతీలాల్ నెహ్రూ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తుషార్‌ను అధ్యక్ష పదవికి, లా కళాశాల విద్యార్థిని మోనా చౌదరిని ఉపాధ్యక్ష పదవికి, ఆర్ట్స్‌కు చెందిన అమిత్ సింగ్ తిమ్మా, అభిషేక్ చౌదరీలను కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
అలాగే బుద్ధిస్ట్ స్టడీస్ విద్యార్థులైన మోహిత్ నగర్, పర్వేష్ మాలిక్‌లను తమ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రకటించింది. కాగా, పర్వీష్ మాలిక్ అభ్యర్థిత్వంపై అధికారులతోపాటు ఇతర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వర్సిటీలో జరిగిన ఒక గొడవలో మరో 14 మందితోపాటు పర్వీష్‌పై కేసు నమోదైంది. దానిపై అతడికి షోకాజ్ నోటీస్ కూడా అందిందని, ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట అతడి అభ్యర్థిత్వంపై తగిన నిర్ణయం తీసుకుంటామని రావత్ తెలిపారు. అలాగే ఏఆర్‌ఎస్‌డీ కళాశాల విద్యార్థి కనిక షెకావత్‌ను కార్యదర్శి పదవికి, జాకీర్ హుస్సేన్ కళాశాల విద్యార్థి అశుతోష్ మాథుర్‌ను సంయుక్త కార్యదర్శి పదవికి రంగంలోకి దించింది. తమ ఉద్యమం వల్లే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేశారని ఏబీవీపీ ప్రచారం చేసుకుంటోంది. అలాగే, డీయూలో ప్రధాన నాలుగు సీట్లను తామే గెలుచుకుంటామని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు తగిన వసతి కల్పించాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా హిందూ కళాశాలలో చదువుతున్న మధురిమ కుందును అధ్యక్ష బరిలో, దయాళ్ సింగ్ కళాశాల విద్యార్థి అమన్ నవాజ్‌ను ఉపాధ్యక్ష బరిలో దించుతున్నట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఏ) తెలిపింది. అలాగే కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు అమన్ గౌతమ్, విక్రమాదిత్యలను రంగంలోకి దింపింది. ఇంతకుముందు డూసూ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ మధ్యే పోటీ నెలకొనేదని, ఈసారి ఆ పరిస్థితి మారుతుందని ఏఐఎస్‌ఏ ప్రతినిధి సన్నీకుమార్ వ్యాఖ్యానించాడు.
కాగా, ఈసారి విద్యార్థి సంఘాల ఎన్నికల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్‌ఓ), అరుణాచల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఎస్‌ఎఫ్) కలిసి లెఫ్ట్ స్టూడెంట్స్ ఫ్రంట్(ఎల్‌ఎస్‌ఎఫ్)గా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ కూటమి తరఫున విక్రమ్ సింగ్, ప్రశాంత్ ముఖర్జీ, శ్రేయ, దీపక్ షా బరిలో ఉన్నారు. ఈ ఏడాదే కొత్తగా ఏర్పడిన విద్యార్థి సంఘం చాణక్య పరిషత్ తరఫున ఆదిత్య పాండే, షహ్రాజ్, దివ్యాంశు ప్రియం, అంతరిక్ష్ రాణా లను రంగంలోకి దింపింది.
ఇదిలా ఉండగా, డూసూ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3వ తేదీనే ముగిసింది. ఒక విద్యార్థి దరఖాస్తు రద్దు చేశామని, మరో 115 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రావత్ తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత అధ్యక్ష పదవికి ఏడుగురు, ఉపాధ్యక్షుడి పదవికి ఆరుగురు, కార్యదర్శికి ఎనిమిది మంది, సంయుక్త కార్యదర్శి పదవికి ఏడుగురు బరిలో మిగిలారు. 12వ తేదీన రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, 13వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిటీ ప్రకటించింది. గత ఏడాది డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ ప్రధాన పోస్టుల్లో మూడింటిని గెలుచుకుని విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఒక్క కార్యదర్శి పదవిని మాత్రం ఎన్‌ఎస్‌యూఐ కైవశం చేసుకోగలిగింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్, బీజేపీ నేత విజయ్ గోయల్ తదితరుల రాజకీయ జీవితం వర్సిటీ నుంచే ప్రారంభమైంది.
‘డూసూ’.. ధూంధాం..!
Published Sun, Sep 7 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement