కలకలం
Published Tue, Feb 18 2014 1:33 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
సాక్షి, చెన్నై:ఈఎంయూ రైల్లో నిప్పురవ్వలు అలజడిని సృష్టించాయి. పెద్ద ఎత్తున వచ్చిన శబ్ధంతో ప్రయాణికుల్లో కలకలం రేగింది. భయాందోళనతో పరుగులు తీశారు. సోమవారం ఉదయం పల్లవరం స్టేషన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకున్నా, అధికారుల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలో ఈఎంయూ(ఎలక్ట్రిక్) రైళ్లు విశిష్ట సేవలను ప్రయాణికులకు అందిస్తున్నాయి. చెన్నై బీచ్ - తాంబరం - చెంగల్పట్టు మార్గాల్లో పది, పదిహేను నిమిషాలకో రైలు పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. సోమవారం ఉదయం బీచ్ నుంచి చెంగల్పట్టుకు ఈఎంయూ రైలు బయలు దేరింది. ఉదయాన్నే కిక్కిరిసిన జనంతో బయలుదేరిన ఈ రైలు సరిగ్గా 6.55గంటలకు పల్లవరం స్టేషన్లో ఆగింది. రైలు బయలుదేరుతున్న సమయంలో వెనుక వైపుగా ఉన్న ఇంజిన్ వద్ద నుంచి పెద్ద శబ్దం రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. అదే సమయంలో నిప్పు రవ్వులు రావడంతో ఆందోళనలో పడ్డారు. అయినా, రైలు ముందుకు కదలడంతో భయాందోళనకు గురయ్యారు. రైలు బయలు దేరిన క్షణాల్లో ముందు వైపుగా ఉన్న ఇంజిన్ వద్ద నుంచి పెద్ద శబ్దం రావడంతో ఆందోళన రెట్టింపు అయింది. ఆ రైలు హఠాత్తుగా ఆగడంతో భయంతో రైలు నుంచి ఫ్లాట్ ఫామ్ మీదకు జనం పరుగులు తీశారు. ఏదో ప్రమాదం జరిగిందన్న ఆందోళనతో ఒకరిని చూసి మరొకరలు బయటకు పరుగులు తీశారు.
అప్రమత్తం: ఫ్లాట్‌ఫామ్‌పై కలకలం రేగడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెంద వద్దని, అందరూ రైలు నుంచి దిగేయాలని సూచిస్తూ మైక్ ద్వారా ప్రకటన చేశారు. కాసేపు ఆ రైల్వే స్టేషన్లో నెలకొన్న తోపులాట, గందరగోళం దీంతో సద్దుమణిగింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న రైల్వే అధికారులు పరిశీలించారు. రైలు ఇంజిన్ నుంచి హైవోల్టేజ్ విద్యుత్ తీగలకు జత పరిచే రాడ్‌లు తెగిపోవడం వల్లే శబ్దంతోపాటు నిప్పురవ్వులు వచ్చినట్టు గుర్తించారు. మరమ్మతులు పూర్తి చేసి రైలును ముందుకు నడిపించే యత్నం చేశారు. కానీ అక్కడి నుంచి రైలు ముందుకు సాగలేదు. దీంతో ఆ మార్గంలో రైలు సేవలు ఆగిపోయూయి. ఎక్కడికక్కడ ఈఎంయూ రైళ్లను ఆపేశారు. తాంబరం నుంచి మరో ఇంజిన్‌ను రప్పించి ఈ రైలును లాక్కెళ్లారు. ఈ ఘటనతో బీచ్ - తాంబరం మార్గంలో గంట సేపు రాక పోకలు ఆగాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్లే మార్గంలో కొన్ని రైళ్లను మళ్లించినా, ఇతర రైళ్ల రాక పోకలకు ఆలస్యమైంది. దక్షిణాది నుంచి ఎగ్మూర్‌కు రావాల్సిన అనేక రైళ్లు గంట ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురి కావాల్సి వచ్చింది. పల్లవరం స్టేషన్ సిబ్బంది సకాలంలో స్పందించి ప్రయాణికులకు భరోసా ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది.
Advertisement
Advertisement