- అందని సర్కార్ వైద్యం
- చిన్నపాటి రోగాలకు సైతం అందుబాటులో లేని మందులు
- పట్టించుకోని ప్రభుత్వం
- అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
సాక్షి, బెంగళూరు : రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అందించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా విద్య ఏనాడో వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం వైద్యం కూడా అదే దారిలో పయనిస్తోంది. పేదల పాలిట సంజీవినిగా ఉన్న సర్కార్ ఆస్పత్రులు కనీస వైద్యం అందించడంలో విఫలమవుతున్నాయి. సర్జరీలు పక్కన పెడితే కనీసం చిన్నపాటి జబ్బులకు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు అందడం లేదు. దీంతో ‘సర్కారీ ఆస్పత్రిలో వైద్యం, యమపురికి ప్రవేశ ద్వారం’ అనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో జబ్బు నయం చేయించుకునేందుకు రోగులు అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళుతున్నారు.
ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో మరింత జఠిలంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత, నైపుణ్యం కొరవడిన మానవ వనరుల కారణంగా అక్కడ చికిత్స పొందేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్లు అధ్యాయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2,366 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8,891 ఉపకేంద్రాలు, 190 సముదాయ ఆరోగ్య కేంద్రాలు, 86 ఆయుర్వేద, యునానీతో పాటు 30 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ జబ్బులకు అవసరమైన పారాసిట్‌మాల్ వంటి టాబ్లెట్‌లు కూడా అందుబాటులో ఉండడం లేదు. చిన్నచిన్న గాయాలకు అవసరమైన డ్రసింగ్ క్లాత్ కూడా ‘బయట కొనుక్కురా’ అన్న డిమాండ్ వైద్యుల నుంచి వినిపిస్తోంది. దీంతో అప్పులు చేసి మరీ పేద రోగులు ప్రైైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం 1,452 మహిళాశిశు సంబంధ (గైనిక్, పిడియాట్రిక్) వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దీంతో స్త్రీ, శిశు సంబంధ వ్యాధుల చికిత్స కోసం గ్రామీణులు ఖర్చు ఎక్కువైనా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్ర కారం 2010-11 ఏడాదిలో 13 లక్షల మంది ప్రజలు సర్కారు ఆసుపత్రుల్లో చికిత్స పొందగా అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య 1.20 కోట్లుగా ఉంది. 2011-12 ఏడాదిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22.36 లక్షల మంది వైద్యం చేయించుకోగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినవారి సం ఖ్య 1.5 కోట్లుగా గణాంకాలు పేర్కొంటున్నాయి. 2012-13 ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య వరుసగా 25 లక్షలు, 1.73 కోట్లుగా ఉంది. ఇక 2013-14లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన రోగుల సంఖ్య 29.35 లక్షలు కాగా, అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1.96 కోట్ల మంది చికిత్స పొందారు. 2014-15లో ఈ సంఖ్య వరుసగా 35 లక్షలు(ప్రభుత్వ), 2.60 కోట్లు(ప్రైవేట్)గా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు చూసిన తర్వాత వైద్య రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలను, అవసరమైన మందులను అందుబాటులోకి తెస్తుందేమో వేచి చూడాలి.
వైద్యం.. పోతోంది !
Published Wed, May 20 2015 5:00 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement