= బియ్యం ధరలు తగ్గు ముఖం
= గత ఏడాది కంటే 40 వేల టన్నులు అధికం
= ఈసారి వర్షాలు బాగా పడటమే కారణం
= ‘బ్లాక్’ వ్యాపారుల్లో గుబులు
= మార్కెట్‌లోకి పాత నిల్వలు
= రూ.60 నుంచి రూ.45కు త గ్గనున్న ‘సోనా’
= బ్లాక్ మార్కెట్‌లో ‘అన్న భాగ్య’ బియ్యం
= అధికారులు, డీలర్లు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కు
= వంద చౌక దుకాణాల డీలర్‌షిప్‌లను రద్దు చేసిన సర్కార్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇన్నాళ్లూ బియ్యం ధరలతో ఠారెత్తిపోయిన వినియోగదారులకు శుభ వార్త. ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి ఉత్పత్తి గణనీయంగా ఉండడంతో బియ్యం ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 40.24 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే 40 వేల టన్నులు అధికం. ఈసారి వర్షాలు బాగా పడడంతో 10.45 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు.
గత ఏడాది కంటే సుమార లక్ష హెక్టార్లు ఎక్కువ. వచ్చే నెలలో పంట నూర్పిడి ప్రారంభమవుతుంది. దీంతో వర్తకులు గత కొద్ది వారాలుగా పాత నిల్వలను మార్కెట్‌కు విడుదల చేస్తున్నారు. దరిమిలా ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. జనం మెచ్చే సోనా మసూరి బియ్యం సగటున రూ.60 నుంచి రూ.45కు తగ్గింది. ఈ సారి వరి దిగుబడి అంచనాల కంటే పది శాతం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. పంట నూర్పిడి తర్వాత మార్కెట్‌ను బియ్యం ముంచెత్తడం ఖాయమని వర్తకులు చెబుతున్నారు. తదనంతరం బియ్యం ధర మరింతగా తగ్గవచ్చని వారు కూడా అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలో విసృ్తతంగా వర్షాలు పడడంతో జలాశయాలన్నీ నిండిపోయాయి. కనుక రైతులు రెండో పంట పెట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ పంటలు చేతికందతాయి. దీని వల్ల కూడా ధరలు మరింతగా తగ్గవచ్చని భావిస్తున్నారు.
అడ్డదారిలో ‘అన్న భాగ్య’
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ అక్రమాలకు నిలయంగా మారుతోంది. ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్లు, బియ్యం వర్తకులు, దళారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. అన్న భాగ్య పథకానికి అవసరమైన బియ్యం లభించక పోవడంతో ప్రభుత్వం వర్తకుల ద్వారా నేషనల్ కమోడిటీస్ అండ్ డిరెవైటివ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌సీడీఎక్స్) నుంచి కొనుగోలు చేస్తోంది.
ఈ పథకానికి నెలకు 2.46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా కేంద్రం నుంచి 1.73 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుతోంది. మిగిలిన బియ్యాన్ని ఎన్‌సీడీఎక్స్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అన్న భాగ్య బియ్యాన్ని నకిలీ బిల్లుల ద్వారా దారి మళ్లిస్తున్నారు. రేషన్ షాపుల స్థాయిలోనే ఈ విధంగా జరుగుతుండడంతో ఇటీవల ఆహార, పౌర సరఫరా శాఖ అధికారులు తుమకూరు, బెల్గాం, మైసూరు, హాసన, హుబ్లీలలో వంద చౌక దుకాణాల డీలర్‌షిప్‌లను రద్దు చేశారు.