రైతు గజేంద్ర సింగ్‌కు స్మారకం
- నిర్ణయించిన ఆప్ ప్రభుత్వం
- రైతుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆలోచింపజేశారు
- ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
- ప్రకటించిన సీఎం కేజ్రీవాల్
- పంట నష్ట పరిహారం ఎకరాకు రూ. 20 వేలు చెల్లింపు
న్యూఢిల్లీ: గత నెలలో జంతర్ మంతర్ వద్ద ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ జ్ఞాపకార్థం స్మారకం నిర్మించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం వెల్లడించారు. ఔటర్ ఢిల్లీలోని బవానా ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు ఆయన పరిహార చెక్కులను అందించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించేలా చేసేందుకు గజేంద్ర తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం త్వరలో మెమోరియల్ నిర్మిస్తామని తెలిపారు.
ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ రోజు ఘటనలో తమ తప్పేమీలేదని పునరుద్ఘాటించారు. ‘సభా వేదికకు చెట్టు చాలా దూరంలో ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు వీలు లేదు’ అని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే పరిహార పథకానికి ‘గజేంద్ర సింగ్ కిసాన్ సహాయతా యోజనా’గా పేరు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగే రైతులకు సహాయం చేయడానికి చొరవ చూపాలని కేంద్ర, అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
గరిష్ట నష్ట పరిహారం రూ. 20 వేలు:
అకాల వర్షాల కారణంగా 70 శాతానికి పైగా పంట నష్టం జరిగిన వారికి ఎకరాకు రూ. 20 వేలు, అంతకంటే తక్కువ నష్టం జరిగిన వారికి రూ. 14 వేలు పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పరిహారం విషయంలో అధికారులకు, రైతులకు ఏమైనా వివాదాలు వస్తే దగ్గరలోని గ్రామ సభలో పరిష్కారం చేసుకోవాలని ఓ ప్రభుత్వాధికారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పరిహారం చాలా ఎక్కువని కేజ్రీవాల్ తెలిపారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రూ. 100 చెక్కులను ఇచ్చాయని, ఆప్ ప్రభుత్వం అత్యధికంగా రూ. 20వేలు చెల్లించిందన్నారు.