
పెళ్లి చేసుకుందనే కోపంతో
ముంబై: వేరే కులస్తుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ తండ్రి కూతురిని నరికి చంపాడు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నింఖాడే గ్రామానికి చెందిన బాలు షివారే తన కుమార్తె మనీషా హింగానేకు పెళ్లి సంబంధం ఖరారు చేశాడు. ఏప్రిల్ 20న పెళ్లి చేయాల్సి ఉంది. అయితే, మనీషా గ్రామానికే చెందిన గణేష్‌ను ప్రేమించి.. అతనితో కలిసి ఎటో వెళ్లిపోయింది. మార్చి 23వ తేదీన గణేష్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, బాలు కూతురిని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు. దీంతో మనీషా భర్తతో కలిసి ఇటీవలే గ్రామానికి వచ్చి అతని కుటుంబంతో కలిసి ఉంటోంది.
బుధవారం సాయంత్రం కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన బాలు.. ఆమెను వెంట తెచ్చుకున్న గొడ్డలితో మెడపై నరికాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చిన గణేష్ రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించాడు. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, నిందితుడు బాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరాయి కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే చంపానని ఒప్పుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.