సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచితంగా ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పలు రాజకీయ పార్టీలు హామీలిచ్చాయి. ఈ సమస్యపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం పోర్చుగీస్ చర్చి సమీపంలోని అమర్‌హింద్ మండల్ హాలులో సమావేశం జరిగింది. గిర్ని కామ్‌గార్ కర్మచారి నివారా, కల్యాణ్‌కారి సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ మినహా శివసేన, జీజేపీ, ఆర్పీఐ, శేత్కారీ కామ్‌గార్ తదితర పార్టీల నాయకులు హాజరయ్యారని ఆ సంస్థ అధ్యక్షుడు కిశోర్ దేశ్‌పాండే, కార్యాధ్యక్షుడు దత్తా రాణే, కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ చెప్పారు.
ప్రతి మిల్లు కార్మికునికి ఉచితంగా ఇల్లు ఇవ్వాలనే ప్రతిపాదనతో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన పార్టీలు తమ తమ వైఖరిని ప్రకటించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిశోర్ దేశ్‌పాండే మాట్లాడుతూ ముంబైలోని జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్ (ఎన్‌టీసీ) అధీనంలోగల 150 ఎకరాల స్థలాన్ని కార్మికుల ఇళ్ల కోసం అందజేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెమ్మార్డీయే సంస్థ నగర శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లు తమకు అవసరం లేదని, ముంబైలో మూతపడిన మిల్లు స్థలాల్లో నిర్మించే ఇళ్లు కావాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఇందుకు పలు పార్టీల నాయకులు అంగీకరించడంపట్ల కార్మికులు, ఆయా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
మేమే ముందు
కార్మికుల ఇళ్ల కోసం జరుపుతున్న పోరాటంలో తమ పార్టీ ముందుందని శివసేన నాయకుడు దివాకర్ రావుతే పేర్కొన్నారు. కార్మికులు నిర్వహించిన వివిధ ర్యాలీల్లో స్వయంగా ఉద్ధవ్ ఠాక్రే పాల్గొని సంఘీభావం తెలిపారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే మిల్లు కార్మికుల ఇళ్ల సమస్య పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శతాబ్దం క్రితం నామమాత్రపు రుసుంతో మిల్లు స్థలాలు పొందిన యజమానులు ఇప్పుడు కోట్లాది కూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఏక్‌నాథ్ మానే ఆరోపించారు. ఆ స్థలాలను కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకే వినియోగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై పోరుకు మద్దతు
Published Mon, Mar 24 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement