
అకస్మాత్తుగా కారు దగ్ధం: మహిళలతోపాటు చిన్నారి సురక్షితం
కారు దగ్ధం
ఐదుగురు మహిళలు, చిన్నారి సురక్షితం
ఎండే కారణమంటున్న నిపుణులు
చెన్నై: శుక్రవారం మధ్యాహ్నం 3.35 గంటలు, నిప్పులు చెరుగుతున్న ఎండ. గిండీ కత్తిపారా బ్రిడ్జీపై వేగంగా వెళుతున్న కారు ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. అకస్మాత్తుగా కారులో మంటలు, నిమిషాల్లో కారు బూడిద. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా మృత్యుంజయుల్లా బైటపడ్డారు.
వివరాల్లోకి వెళితే... చెన్నై నగరం కేకే నగర్ మీదుగా విమానాశ్రయం వైపు ఒక లగ్జరీకారు వేగంగా వెళుతోంది. గిండి కత్తిపారా బ్రిడ్జిపై వెళుతున్న సమయంలో కారు బాయ్‌నెట్‌లో నుంచి పొగలు వచ్చాయి. డ్రైవరు గమనించి తేరుకునేలోగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు కారును రోడ్డుకు ఒకవైపు నిలిపి తలుపులు తెరిచి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు, చిన్నారిని బైటకు లాగేశాడు. వారంతా దూరంగా పరుగులు తీస్తున్న క్షణంలో భారీఎత్తున ఎగిసిపడిన మంటలు కారును పూర్తిగా కమ్మేశాయి.
ఇంతలో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అగ్నిపాపక సిబ్బంది పది మంది సుమారు అరగంటకు పైగా పోరాడి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా కత్తిపారా జంక్షన్ బ్రిడ్జిపై గంటసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు, చిన్నారి సురక్షితంగా బైటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రయాణికులు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న ఎండల వల్ల కారు ఇంజన్ వేడెక్కడం వల్లనే మంటలు రేగాయని నిపుణులు చెప్పారు. వేసవి కాలంలో ప్రతి గంటకు ఒకసారి కారు ఇంజన్‌కు విరామం ఇవ్వకుంటే ఇటువంటి ప్రమాదాలకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.