నవీ ముంబైలో ఆకాశ హర్మ్యాలపై అగ్నిమాపక విభాగం దృష్టి | Fire department eyes on high rise buildings of navi mumbai | Sakshi
Sakshi News home page

నవీ ముంబైలో ఆకాశ హర్మ్యాలపై అగ్నిమాపక విభాగం దృష్టి

Published Mon, Nov 25 2013 11:23 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

Fire department eyes on high rise buildings of navi mumbai

సాక్షి. ముంబై: నవీముంబై పట్టణంలోని ఆకాశ హర్మ్యాలపై అగ్నిమాపక విభాగం దృష్టి పడింది. ప్రమాద నివారణ, భద్రత కోణంలో అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకు 450  ఆకాశ హర్మ్యాలకు నోటీసులు పంపించింది. భద్రత దృష్ట్యా అన్నింటిలో అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) పరిధిలో ఐదు కంటే ఎక్కువ అంతస్తులు ఉన్న భవనాలు సుమారు 1,500 ఉన్నాయి. ఎత్తై భవనాల్లో సొంత అగ్నిమాపక వ్యవస్థ ఉండడం అవసరం. అగ్నిమాపక విభాగం  నియంత్రణ పరికరాలున్నాయా? లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాతే భవనానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది.
 
అయితే ఒకసారి ఈ ధ్రువీకరణ పత్రం లభించిన తర్వాత  అగ్నిమాపక సాధనాల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తారు. ఇందువల్ల ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఎత్తై భవనాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే చాలా మంది అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే కార్పొరేషన్ తన పరిధిలోని భవనాల్లో అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేస్తోంది. అగ్నిమాపక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ఎన్‌ఎంఎంసీ కమిషనర్ సూచించారు. ఈ విషయంలో నివాసితులకు అవగాహన కలిగించేందుకు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జాగృతం చేస్తామన్నారు.
     
గంటలోపే మంటలు అదుపులోకి
వాషి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మైథిలీ టవర్‌లోని 14వ అంతస్తులో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. అయితే ఈ భవనంలో అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది గంటలోపే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ముందుగానే సిద్ధంగా ఉన్న అగ్నిమాపక వ్యవస్థను ఉపయోగించడం వలన ప్రమాదాన్ని సులువుగా ఎదుర్కోగలిగామని అగ్నిమాపక విభాగం అధికారి విజయ్ రాణే తెలి పారు. అన్నిచోట్ల అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ అందుబాటులో ఉన్నట్లయితే  ప్రమాదాల నివారణ సులభమవుతుందని ఆయన వివరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement