గూడ్స్ రైల్లో మంటలు
Published Fri, Aug 23 2013 4:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: చెన్నై షిప్ యార్డు నుంచి నేల బొగ్గులోడుతో మేట్టూరుకు వెళుతున్న గూడ్స్‌రైలులో కడంబత్తూరు వద్ద హఠాత్తుగా మంటలు వచ్చాయి. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గూడ్సు రైల్లోంచి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చెన్నై షిప్‌యార్డు నుంచి మేట్టూరుకు 40 పెట్టెలతో కూడిన గూడ్స్‌రైలు నేల బొగ్గుతో గురువారం తెల్లవారుజాము 4.10 గంటలకు బయలు దేరింది. గూడ్స్ రైలు తిరువళ్లూరు సమీపంలోని సెవ్వాపేట వద్దకు వస్తున్న సమయంలో రెండు పశువులను ఢీ కొట్టింది. దీంతో అక్కడే నిలిచిపోయిన గూడ్స్ దాదాపు రెండు గంటల అనంతరం 6.10 గంటలకు బయలుదేరింది.
రైలు తిరువళ్లూరును దాటుతున్న సమయంలో 11వ పెట్టె నుంచి పొగ, స్వల్పంగా మంటలు రావడాన్ని స్టేషన్ అధికారులు గుర్తించి కడంబత్తూరు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో గూడ్స్ రైలును కడంబత్తూరు వద్దనే నిలిపి వేశారు. కడంబత్తూరు రైల్వేస్టేషన్‌లో వేచి వున్న ప్రయాణికులు గూడ్స్ రైలులో వస్తున్న పొగలను చూసి ఆందోళనకు గురయ్యారు. మంటలను చూసి భయాందోళన చెందిన ప్రయాణికులు పరుగులు తీశారు. దీంతో కడంబత్తూరు రైల్వేపోలీసులకు సమాచారం అదించారు. ఈ నేపథ్యంలో గూడ్స్ రైలులో మంటలు మరింతగా చెలరేగే అవకాశం వుండడంతో పేరంబాక్కం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి 20 నిమిషాల వ్యవధిలోనే చేరుకున్నా మంటలను ఆర్పడానికి దాదాపు గంట పాటు వేచి వుండాల్సిన పరిస్థితి తలెత్తింది. రైలు పై విద్యుత్ తీగలు ఉన్నాయి.
ద్యుత్ సరపరాను నిలిపి వేస్తేనే మంటలను అర్పడానికి అవకాశం వుంటుందని సిబ్బంది తేల్చిచెప్పడంతో చెన్నై అధికారులకు సమాచారం అందించారు. వారు ఉన్నత అధికారులతో సంప్రదింపులు జరిపి 9 గంటలకు మంటలను ఆర్పడం ప్రారంభించారు. దాదాపు గంట సేపు పోరాడి మంటలను అదుపు చేశారు. కాగా గూడ్స్ రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో తిరువళ్లూరు, కడంబత్తూరు, ఏకాటూరు తదితర ప్రాంతాల నుంచి నడిచే రైలు సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి. ఇది ఇలా వుండగా కడంబత్తూరులో ఉద్రిక్తత కారణంగా ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకూ గేట్లు మూసి వేయడంతో గేటుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
Advertisement
Advertisement