ప్రమాదాల్లో ఫస్ట్ | First in accidents | Sakshi
Sakshi News home page

ప్రమాదాల్లో ఫస్ట్

Published Sat, Oct 29 2016 2:11 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

First  in accidents

దేశ స్థాయిలో తమిళనాడు అగ్రస్థానం
రవాణాశాఖదే ప్రమాదాల పాపం

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఇతర రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నదో లేదో ప్రమాదాల్లో మాత్రం ప్రథమస్థానంలో నిలిచి తలవంపులుగా మారింది.  ట్రాఫిక్ ఆంక్షలను పోలీసు, రవాణాశాఖ అధికారులు అటకెక్కించిన ఫలితంగా తమిళనాడు ప్రమాదాల రాష్ట్రంగా దిగజారిందని సంఘ సంస్కర్తలు ఆక్షేపిస్తున్నారు. దేశంలోని ఢిల్లీ, ముంబయి నగరాల తరువాత అంతటి ప్రాధాన్యం కలిగి ఉన్న తమిళనాడు అనేక రంగాలకు అలవాలంగా ఎదుగుతోంది.  ముఖ్యంగా పర్యాటక రంగంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిపోయేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. భారత దేశం మొత్తం మీద రోజుకు సగటున 1,214, ఏడాదికి 1.2 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వీటిల్లో అధికశాతం అంటే ఏడాదికి 15 వేల రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో జరుగుతున్నాయి.

రహదారుల్లో ఫుట్‌పాత్‌లు లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతూ వాహనాలను నడిపేవారిని నిలదీసే పోలీసు అధికారులు లేకపోవడం, మద్యం తాగి వాహనాలను నడిపేవారి సంఖ్య పెరిగిపోవడం ప్రమాదాలకు కారణంగా మారింది. ట్రాఫిక్‌పై కఠిన అంక్షలు ఉన్నా వాటిని అమలు చేయడంలో పోలీసుల ఉదాసీనత ప్రమాదాలను పెంచి పోషిస్తోంది. 2012లో 15,072 ప్రమాదాలు జరుగగా 16,175 మంది మృతి చెందారు. అలాగే 2013లో 14, 504 ప్రమాదాల్లో 15,563, 2014లో 14,615 ప్రమాదాల్లో 15, 190, 2015లో 14, 524 ప్రమాదాల్లో 15, 642 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ 7వ స్థానం, కేరళ 13వ స్థానం, కర్ణాటక 30వ స్థానంలో ఉండడం గమనార్హం. గతంలో జాతీయ రహదారుల్లో మాత్రమే ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోవడం జరిగేది.

 కానీ ఇటీవల చెన్నై నగరం కూడా ప్రమాదాల నిలయంగా మారిపోయింది. చెన్నై గిండిలో ఇటీవల మంచినీటి ట్యాంకర్ లారీ ముగ్గురు కాలేజీ విద్యార్థినులను బలితీసుకుంది. చెన్నై నగరంలోకి చెత్తను ఎత్తివేసే లారీలు, మంచి నీటి ట్యాంకర్లు, సరకును దింపే లారీలు పగటి వేళల్లో రాకూడదని ఆంక్షలు ఉన్నాయి. అయితే కొందరు పోలీసుల ఆశీస్సులతో అక్రమంగా ప్రవేశించే ఇలాంటి వాహనాలు తరచూ ప్రమాదానికి కారణం అవుతున్నాయి. మితిమీరుతున్న భారీ వాహనాలు, జరుగుతున్న ప్రమాదాలపై తమిళనాడు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులు సుకుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం ప్రథమ స్థానం నిలవడానికి ట్రాఫిక్ పోలీసు అధికారులూ పూర్తికారణమని అన్నారు. ఏడాదికి ఒకసారి ప్రతి వాహనాన్ని తనికీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి. అరుుతే నగరంలో తిరిగే ఎక్కువ శాతం వాహనాలకు సర్టిఫికెట్ ఉండదని అన్నారు.

ఆర్టీవో అధికారులు వాహనానికి రూ.20వేలు లంచంగా పొంది ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు జారీచేయడం పరిపాటిగా మారింది. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగిందని ముగ్గురు విద్యార్థినులను బలితీసుకున్న లారీ డ్రైవర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన వారం రోజుల ముందే ఆ లారీకి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీకావడం గమనార్హమని ఆయన తెలిపారు. ఆరు చక్రాల లారీ 8వేల లీటర్లు, 10 చక్రాల లారీ 15వేల లీటర్లు నింపుకోవాల్సి ఉండగా, ప్రయివేటు కంపెనీలకు చెందిన 6 చక్రాల తాగునీటి లారీలు 20 వేల లీటర్లు, 10 చక్రాల లారీలు 30 నుంచి 35వేల లీటర్లు తీసుకుని నగరంలో తిరుగుతున్నాయని ఆయన అన్నారు. భారీ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ, నిబంధనలు ఇవ్వడంతోపాటు వాటి అమలుపై కఠినంగా వ్యవహరించినపుడే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement