
సాక్షి, బెంగళూరు: తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఒక ఉత్సాహం, ఆసక్తి ఉంటాయి. ఓటు ఎలా వేయాలి అనే సందేహం వస్తుంది. ఏమేం కార్డులు తీసుకెళ్లాలి, ఈవీఎం ఎలా ఉపయోగించాలి అనే అనుమానాలు వస్తే వాటిని నివృత్తి చేసుకోవడం ఉత్తమం. పొరపాటు చేస్తే సరిదిద్దుకోవడం కష్టం. రాష్ట్రంలో ఈ ఎన్నికలకు 15 లక్షలకు పైగా కొత్త, యువ ఓటర్లు నమోదయ్యారు. తొలిసారి ఓటర్లే కాదు.. ఓటర్లందరూ తెలుసుకోవాల్సిన విషయమే.
ఓటును ఎలా నిర్ధారించుకోవాలి?
♦ తొలుత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని ఓటర్ల జాబితాలో పేరును చెక్ చేసుకోవాలి.
♦ ఆ తర్వాత ఈఆర్‌వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి) కార్యాలయం నుంచి ఓటరు గుర్తింపు కార్డును పొందాలి.
♦ www.eci.nic.in , www.ecisveep.nic.in , www.nvsp.in లేదా 1950 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి పోలింగ్ కేంద్రాన్ని కనుక్కోవచ్చు.
పోలింగ్ కేంద్రం వద్ద..
♦ క్యూలో వెళ్లాలి. ఇక్కడ అందరూ సమానమే.
♦ తొలుత ఎన్నికల అధికారికి ఓటరు గుర్తింపు కార్డును చూపించాలి.
♦ అన్నీ కరెక్టుగా ఉంటే ఆ అధికారి ఓటరు ఎడమ చేయి చూపుడు వేలికి సిరా మార్కును వేస్తారు. ఆ తర్వాత అధికారి ఇచ్చే ఓటర్ స్లిప్‌ను తీసుకోవాలి. అనంతరం రిజిస్టర్ ఓటర్ సంతకం చేయాలి.
♦ ఆ తర్వాత ఓటింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి ఈవీఎంపై ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి/ పార్టీ గుర్తుపై బటన్‌ను నొక్కాలి.
♦ బటన్ ఒత్తగానే బీప్ అనే శబ్దం వస్తుంది. దీంతో ఓటు రిజిస్టర్ అయినట్లు గుర్తించాలి. బీప్ శబ్దం రాకుంటే సిబ్బందికి తెలపాలి.
♦ ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా వీవీ ప్యాట్ మెషీన్లను ఉపయోగిస్తున్నారు. ఓటు వేయగాని అందులో నుంచి ఏ అభ్యర్థికి/ గుర్తుకు వేశారో తెలిపే ఒక స్లిప్ వస్తుంది. ఏడు క్షణాల తరువాత అది బాక్సులోకి పడిపోతుంది. దానిని తీసుకోకూడదు.
ఈ కార్డులు ఉన్నాయా?
♦ ఓటరు కార్డు, ఒకవేళ అది పోయినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాసు పుస్తకాలు, ప్యాన్ కార్డు, పెన్షన్ ధ్రువీకరణ పత్రం, ప్రజాప్రతినిధులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు (వీటిలో ఏదో ఒకటి ఒరిజినల్ కార్డును తీతీసుకెళ్లాలి)
ఎస్‌ఎంఎస్‌తో సమాచారం
♦ పోలింగ్ కేంద్రం వివరాల కోసం 9731979899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి. మొబైల్ నుంచి కేఏఈపీఐసీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడీ నంబర్‌ను టైప్ చేయాలి. ఆ మెసెజ్‌ను ఈ నంబర్‌కు పంపించాలి.
♦ పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలు తీసుకోవడం, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి తీసుకెళ్లకూడదు.