ఇంటింటికీ ఇంటర్నెట్
- అంతా ఆన్‌లైన్‌మయం
- ‘ఈ’ ద్వారా 300 సేవలు
- ఆప్టికల్ ఫైబర్ కార్పొరేషన్ ఏర్పాటు
- అసెంబ్లీలో సీఎం జయలలిత వెల్లడి
- ప్రతి పక్షాలకు ప్రసంగాల్లేవు
- స్పీకర్ తీరుపై నిరసన
- డీఎంకే, పీఎంకే, వామపక్షాల వాకౌట్
సాక్షి, చెన్నై: ప్రజలకు అన్ని రకాల సేవలు ఆన్‌లైన్ ద్వారానే అందించేందుకు సీఎం జె.జయలలిత నిర్ణయించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా మూడు వందల రకాల సేవల్ని అందించనున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవల్ని, ఆన్‌లైన్ టీవీ ప్రసారాలు కల్పించబోతున్నారు. చెన్నైలో ఆప్టికల్ ఫైబర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ధనపాల్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి పక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తొమ్మిది రోజుల విరామంతో సోమవారం మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి.
ప్రశ్నోత్తరాల అనంతరం డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ లేచి పెట్టుబడుల మహానాడు అని పెదవి విప్పగానే, స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని మాట్లాడే అవకాశం తర్వాత ఇస్తానంటూ నచ్చజెప్పారు. అలాగే పీఎంకే, సీపీఎం, సీపీఐ, పుదియ తమిళగం, కాంగ్రెస్ సభ్యులు తమకూ అవకాశం అంటూ పెదవి విప్పే యత్నం చేయగా, స్పీకర్ అడ్డుకున్నారు. ముందు సీఎం జయలలిత 110 నిబంధనల మేరకు ప్రత్యేక ప్రకటన చేయబోతున్నారంటూ ప్రతి పక్షాల గళాన్ని నొక్కే యత్నం చేశారు. ఇంతలో సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటన పాఠాన్ని అందుకున్నారు.
ఇంటింటికీ ఇంటర్నెట్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలసి భారత్ నెట్ పథకం ద్వారా గ్రామాల్ని అనుసంధానించేందుకు నిర్ణయించి ఉన్నదని వివరించారు.
ఆ దిశగా రాష్ట్రంలో 12,524 గ్రామ పంచాయతీలను అనుసంధానించబోతున్నామని, ఇందు కోసం తమిళనాడు ఆప్టికల్ ఫైబర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇందుకు గాను రూ.మూడు వేల కోట్లను ఖర్చు పెట్టనున్నామన్నారు. అలాగే, సమాచార వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని వివరిస్తూ, ఇంటర్నెట్ ఆవశ్యకత పెరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇంటింటికీ తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవల్ని అందించబోతున్నామని ప్రకటించారు. తద్వారా కేబుల్ కార్పొరేషన్ నేతృత్వంలో ఆన్‌లైన్ టీవీ ప్రసారాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించామని వివరించారు. ప్రస్తుతం ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు 36 రకాల సేవల్ని మాత్రమే అందిస్తున్నామని, ఇక మూడు వందల రకాల సేవల్ని అందించబోతున్నామని ప్రకటించారు.
ప్రసంగాల్లేవు: సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటన పాఠం ముగియగానే, మళ్లీ డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ ప్రసంగించేందుకు లేచారు. మళ్లీ స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని, సీఎం ప్రకటనపై కృతజ్ఞతల తదుపరి అవకాశం ఇస్తామంటూ బుజ్జగించే యత్నం చేశారు. దీంతో అన్నాడీఎంకే మిత్ర పక్షం కుడియరసు కట్చి ఎమ్మెల్యే సేకు తమిళరసన్, కొంగు ఇలైంజర్ కట్చి సభ్యుడు తనియరసు, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు కదిరవన్, మంత్రులు వలర్మతి, ముక్కూరు సుబ్రమణ్యం, స్పీకర్ ధనపాల్ కృతజ్ఞతలు తెలుపుతూ, తమ అమ్మను పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ తంతు ముగియగానే మళ్లీ స్టాలిన్ పైకి లేచి మాట్లాడే యత్నం చేయగా, ఉదయాన్నే తమరు తన దృష్టికి పెట్టుబడుల వ్యవహారం గురించి తీసుకొచ్చారని, ఇది పరిశీలనలో ఉందని, ప్రభుత్వంతో చర్చించి మాట్లాడే అవకాశం ఇస్తాన ని పేర్కొనడంతో డీఎంకే సభ్యుల్లో ఆగ్రహం రేగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ స్పీకర్ పోడియంను చుట్టముట్టారు. అదే సమయంలో సభ నుంచి సీఎం జయలలిత బయటకు వెళ్లి పోయారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డీఎంకే సభ్యులు నినదించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇక, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, పీఎంకే, పుదియ తమిళగం సభ్యులు సైతం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నినదించడంతో సభలో అరుపులు కేకలు దద్దరిల్లాయి.
ప్రతిపక్షాల వాకౌట్ : అవకాశం ఇస్తాం..అవకాశం ఇస్తాం...అంటూ నచ్చచెప్పి, చివరకు పరిశీలనలో ఉందంటూ స్పీకర్ పేర్కొనడాన్ని స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. కాసేపు స్పీకర్‌తో వాగ్యుద్దానికి దిగారు. చివరకు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. స్పీకర్ తీరుపై తీవ ఆగ్రహాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు. తదుపరి వాకౌట్ల పర్వం ఊపందుకుంది. కాంగ్రెస్ సభ్యుడు ప్రిన్స్, పీఎంకే సభ్యుడు గణేష్ కుమార్ సహాయం విచారణ గురించి ప్రస్తావించారో లేదో, అందుకు సమయం లేదంటూ స్పీకర్ కరాఖండీగా తేల్చారు. దీంతో ఆ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. తాము ఇచ్చిన సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని సీపీఎం శాసన సభా పక్ష నేత సౌందరరాజన్, సీపీఐ శాసన సభా పక్షనేత ఆర్ముగం స్పీకర్ దృష్టికి తెచ్చారు. ఇవి కూడా పరిశీలనలోనే ఉన్నాయని స్పీకర్ చెప్పడంతో ఆ పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం పుదియ తమిళగం సభ్యుడు కృష్ణస్వామి కూడా వాకౌట్ చేయడంతో అధికార పక్షం సభ్యులు సభలో మిగిలారు.