= ఎగిసిపడుతున్న కెరటాలు
= మొదలైన వర్షాలు
= వేటకు జాలర్ల దూరం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బల పడింది. తుపానుగా మారిన ఈ ద్రోణికి మ్యాడీ అని నామకరణం చేశారు. మ్యాడీ రూపంలో రాష్ట్రానికి ముప్పు లేకున్నా, వర్షాలు మాత్రం కురుస్తున్నాయి. సాగర తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో జాలర్లు చేపల వేటకు దూరంగా ఉన్నారు.
సాక్షి, చెన్నై : పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్ల రూపంలో రాష్ట్రానికి మోస్తారుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మరో తుపాను రూపంలో కొంత మేరకు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో నైరుతీ దిశలో ఇటీవల అల్పపీడన ద్రోణి బయలు దేరింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో విడతలు వారీగా వర్షాలు పడుతున్నాయి. నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్ని మాత్రం వర్షం ముంచెత్తింది.
చెన్నైకు ఆగ్నేయంలో 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి బలపడింది. శుక్రవారం అర్ధరాత్రి మరింత బలపడిన ఈ ద్రోణి తుపానుగా మారింది. దీనికి మెడీ అని నామకరణం చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
కెరటాల జడి: ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి ముప్పు లేదని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మాల్దీవుల వైపుగా ఈ తుపాన్ తీరం దాటనున్నది. ఈ నెల పదో తేదీ లేదా 11న తీరం దాటొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రభావం కారణంగా సముద్ర తీర జిల్లాలు తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, కడలూరు, నాగప్పటం, తిరువారూర్, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో వర్షాలు పడుతున్నాయి.
చెన్నైలో శనివారం ఆకాశం మేఘావృతమైంది. విడతలు వారీగా వర్షాలు పడుతున్నాయి. కాశి మేడు, ఎన్నూరు, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు సందర్శకులకు కనువిందుగా మారాయి. యువత ఆ కెరటాల మధ్యలో తమ సాహసాన్ని ప్రదర్శించే విధంగా జలకాలాటల్లో మునిగారు. కెరటాల తాకిడి క్రమంగా పెరగడంతో చిన్న చిన్న పడవలను కలిగిన జాలర్లు చేపల వేటకు దూరమయ్యారు.
నడి సముద్రంలోకి వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో మర పడవలు, మోటార్ బోట్ల పడవలు కలగిన జాలర్లు కడలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. చెన్నైలో మూడు వేల మంది జాలర్లు శనివారం చేపల వేటకు వెళ్లలేదు. వాతావరణ కేంద్రం హెచ్చరికలు, ఇచ్చే సమాచారం మేరకు కడలిలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గాలుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో సముద్ర తీరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
మ్యాడీతో ‘అల’ జడి
Published Sun, Dec 8 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement