Thiruvarur
-
బ్యాంకు వద్ద తుపాకితో సన్యాసి హల్చల్... షాక్‌లో ఉద్యోగులు
చెన్నై: ఒక బ్యాంకు వద్ద సన్యాసి తుపాకితో హల్ చల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లో చోటు చేసుకుంది. ఒక సన్యాసి రైఫిల్ చేతపట్టుకుని బ్యాంకు ఉద్యోగులపై బెదరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తిరుమలై స్వామి అనే సన్యాసి తిరువారూర్ జిల్లాలోని మూలంగుడి గ్రామ నివాసి. ఆ సన్యాసి తన కుమార్తె చదువు కోసం లోన్ కావాలంటూ ఒక ప్రైవేట్ బ్యాంకు వద్దకు వచ్చాడు. తన కూతురు చైనాలో మెడిసిన్ చదివేందుకు లోన్ కావాలని అడిగాడు. అందుకు హామీ పత్రాలు సమర్పించాల్పి ఉంటుందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐతే సన్యాసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు నిరాకరించాడు. తానే వడ్డితో సహా కట్టేస్తాను కాబట్టి హామీ పత్రాలు ఎందుకంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అధికారులు వివరంగా చెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నాడు. చేసేదేమి లేక బ్యాంకు అధికారుల లోన్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో సన్యాసి ఇంటికి వెళ్లి తుపాకిని తీసుకుని లోన్ ఇస్తారా? లేదా? అని ఉద్యోగులను బెదిరించడం ప్రారంభించాడు. సామాజిక మాధ్యమాల్లో సైతం సదరు సన్యాసి లోన్ ఇవ్వనందుకు బ్యాంకును లూటీ చేస్తానంటూ లైవ్ వీడియోని పోస్ట్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు సన్యాసిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం) -
తొలిసారి తిరువారూర్‌కు సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తిరువారూర్‌కు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తన తండ్రి దివంగతనేత కరుణానిధి జన్మస్థలం తిరుకువళైకు వెళ్లారు. అక్కడి గృహంలోని అవ్వ, తాత, తండ్రి విగ్రహాలకు నివాళులర్పించారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారిగా తన తండ్రి జన్మస్థలం తిరుకువళైకు సతీమణి దుర్గా స్టాలిన్, తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌తో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. తిరుచ్చిలో సీఎంకు పార్టీ నేతలు, అధికారులు ఆహ్వానం పలికారు. అక్కడ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రి ఆవరణలో శిశుసంక్షేమ, ప్రసూతి వైద్యకేంద్రాన్ని ప్రారంభించారు. దీన్ని రూ.12 కోట్లతో నిర్మించారు. అక్కడి వసతులను ఆరోగ్యమంత్రి సుబ్రహ్మణ్యన్, అధికారులు సీఎంకు వివరించారు. ఈసందర్భంగా కరోనా టీకాలు వేయడంలో తొలిస్థానంలో నిలిచిన కాట్టూరు గ్రామ సర్పంచ్ విమల ప్రభాకర్, తిరువారూర్జిల్లా కలెక్టర్ గాయత్రిని సత్కరించారు. అలాగే తనను కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి కేఎన్ నెహ్రూ, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయ్.. కుటుంబ సమేతంగా తిరుకువళైకు వెళ్లిన సీఎం స్టాలిన్ అక్కడ తన తండ్రి ఇంటికి వెళ్లారు. తన తండ్రి బాల్యంతో పాటుగా రాజకీయ పయనానికి ముందుగా పూర్తి కాలం ఇదే ఇంట్లో ఉన్న విషయాన్ని మనవళ్లు, మనువరాళ్ల దృష్టికి తెచ్చే రీతిలో సీఎం స్టాలిన్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. -
సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి
సాక్షి, చెన్నై: సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి వీడియో కాల్ మాట్లాడుతున్న సయయంలో దురదృష్టవశాత్తూ ఫోన్ పేలడంతో ఓ యువతి చూపు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడుతోంది. అయితే అకస్మాత్తుగా సెల్ పేలడంతో... ఆ ముక్కలు ఆర్తి కళ్ళలో గుచ్చుకున్నాయి. చెవిలోకి కూడా వెళ్లాయి. దీంతో కుటుంబీకులు ఆర్తీని వెంటనే నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకుప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సెల్ ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫోన్ వాడకంపై అజాగ్రత్తగా ఉండటం వల్లే గాయపడటంతో పాటు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జనాల్లో అవగాహన లేకుండా పోతోంది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్‌ని అలాగే మాట్లాడటం, తడి చేతులతో ఛార్జింగ్ పెట్టడంతో పాటు రాత్రంతా చార్జింగ్ పెట్టిన ఫోన్లు విపరీతంగా వేడెక్కి పేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫోన్లు వాడకాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినా, పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి సంఘటనలకు దారితీస్తున్నాయి. -
టిక్‌టాక్ వైపరీత్యం..!
సాక్షి, చెన్నై: టిక్‌టాక్ ప్రభావంతో ప్రియురాలిని కత్తితో పొడిచి ప్రియుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. తిరువారూరు జిల్లా కోట్టూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన జగదీష్‌బాబు (25) నాగై జిల్లాకు చెందిన ఓ కళాశాల విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఐదు నెలలుగా కోట్టూరు వద్ద సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు విద్యార్థినికి టిక్‌టాక్‌లో నామక్కల్‌కు చెందిన బొన్నర్ (25) అనే యువకుడితో పరిచయమై అతనితో కలిసి పారిపోయింది. విషయం తెలుసుకున్న ప్రియుడు జగదీష్‌బాబు విద్యార్థినికి ఫోన్‌చేసి కోట్టూరుకు రమ్మన్నాడు. అక్కడ మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పారు. దీంతో ఆమె బొన్నర్‌తో పాటు కోట్టూరుకు వచ్చింది. అక్కడికి వచ్చిన తరువాత ప్రియురాలితో గొడవపడిన జగదీష్‌బాబు తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతుపై పొడిచి, అక్కడే తాను విషం తాగాడు. ఇది చూసిన స్థానికులు విద్యార్థినిని తిరువారూర్ ఆసుపత్రికి, జగదీష్‌బాబును మన్నార్‌కుడి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
మ్యాడీతో ‘అల’ జడి
= ఎగిసిపడుతున్న కెరటాలు = మొదలైన వర్షాలు = వేటకు జాలర్ల దూరం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బల పడింది. తుపానుగా మారిన ఈ ద్రోణికి మ్యాడీ అని నామకరణం చేశారు. మ్యాడీ రూపంలో రాష్ట్రానికి ముప్పు లేకున్నా, వర్షాలు మాత్రం కురుస్తున్నాయి. సాగర తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో జాలర్లు చేపల వేటకు దూరంగా ఉన్నారు. సాక్షి, చెన్నై : పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్ల రూపంలో రాష్ట్రానికి మోస్తారుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మరో తుపాను రూపంలో కొంత మేరకు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో నైరుతీ దిశలో ఇటీవల అల్పపీడన ద్రోణి బయలు దేరింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో విడతలు వారీగా వర్షాలు పడుతున్నాయి. నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్ని మాత్రం వర్షం ముంచెత్తింది. చెన్నైకు ఆగ్నేయంలో 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి బలపడింది. శుక్రవారం అర్ధరాత్రి మరింత బలపడిన ఈ ద్రోణి తుపానుగా మారింది. దీనికి మెడీ అని నామకరణం చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కెరటాల జడి: ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి ముప్పు లేదని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మాల్దీవుల వైపుగా ఈ తుపాన్ తీరం దాటనున్నది. ఈ నెల పదో తేదీ లేదా 11న తీరం దాటొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రభావం కారణంగా సముద్ర తీర జిల్లాలు తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, కడలూరు, నాగప్పటం, తిరువారూర్, తూత్తుకుడి, కన్యాకుమారిల్లో వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో శనివారం ఆకాశం మేఘావృతమైంది. విడతలు వారీగా వర్షాలు పడుతున్నాయి. కాశి మేడు, ఎన్నూరు, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు సందర్శకులకు కనువిందుగా మారాయి. యువత ఆ కెరటాల మధ్యలో తమ సాహసాన్ని ప్రదర్శించే విధంగా జలకాలాటల్లో మునిగారు. కెరటాల తాకిడి క్రమంగా పెరగడంతో చిన్న చిన్న పడవలను కలిగిన జాలర్లు చేపల వేటకు దూరమయ్యారు. నడి సముద్రంలోకి వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో మర పడవలు, మోటార్ బోట్ల పడవలు కలగిన జాలర్లు కడలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. చెన్నైలో మూడు వేల మంది జాలర్లు శనివారం చేపల వేటకు వెళ్లలేదు. వాతావరణ కేంద్రం హెచ్చరికలు, ఇచ్చే సమాచారం మేరకు కడలిలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గాలుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో సముద్ర తీరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.