
సాక్షి, చెన్నై: టిక్‌టాక్ ప్రభావంతో ప్రియురాలిని కత్తితో పొడిచి ప్రియుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. తిరువారూరు జిల్లా కోట్టూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన జగదీష్‌బాబు (25) నాగై జిల్లాకు చెందిన ఓ కళాశాల విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఐదు నెలలుగా కోట్టూరు వద్ద సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు విద్యార్థినికి టిక్‌టాక్‌లో నామక్కల్‌కు చెందిన బొన్నర్ (25) అనే యువకుడితో పరిచయమై అతనితో కలిసి పారిపోయింది. విషయం తెలుసుకున్న ప్రియుడు జగదీష్‌బాబు విద్యార్థినికి ఫోన్‌చేసి కోట్టూరుకు రమ్మన్నాడు. అక్కడ మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పారు. దీంతో ఆమె బొన్నర్‌తో పాటు కోట్టూరుకు వచ్చింది. అక్కడికి వచ్చిన తరువాత ప్రియురాలితో గొడవపడిన జగదీష్‌బాబు తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతుపై పొడిచి, అక్కడే తాను విషం తాగాడు. ఇది చూసిన స్థానికులు విద్యార్థినిని తిరువారూర్ ఆసుపత్రికి, జగదీష్‌బాబును మన్నార్‌కుడి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment