కాంగ్రెస్ మాజీ ఎంపీకి రెండేళ్ల జైలు
కాంగ్రెస్ మాజీ ఎంపీకి రెండేళ్ల జైలు
Published Fri, Jun 23 2017 8:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
►చెక్‌బౌన్స్ కేసులో కింది కోర్టు తీర్పును నిర్ధారించిన చెన్నై అదనపు కోర్టు
చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అన్బరసుకు కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను చెన్నై అదనపు కోర్టు ఖరారు చేసింది. రాజీవ్‌గాంధీ విద్యా ట్రస్ట్ కోసం ముకుంద్‌చంద్ బోద్రా అనే ఫైనాన్షియర్ నుంచి 2002లో అన్బరసు రూ.35 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించేందుకు ఫైనాన్షియర్‌కు ఆయన చెక్కు ఇచ్చాడు.
అయితే ఇది బౌన్స్ అయింది. అన్బరసు, ఆయన భార్యకు జైలు శిక్ష విధించాలని బాధితుడు కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్‌ను విచారించి అన్బరసు, ఆయన భార్య కమల, ట్రస్ట్ నిర్వాహకుడు మణిలకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2015లో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అలాగే ట్రస్ట్ నిర్వాహకులైన 8 మంది కలిసి రూ.35 లక్షలకు ఏడాదికి 9 శాతం చొప్పన వడ్డీ చెల్లించాలని ఆదేశించారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ చెన్నై అదనపు బెంచ్ కోర్టులో నిందితులు అప్పీలు చేసుకున్నారు. ఈ అప్పీలు పిటిషన్‌ను బెంచ్ కోర్టు న్యాయమూర్తి శాంతి శుక్రవారం విచారించి కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అన్బరసు సతీమణి కమల మృతిచెందడంతో ఆమెకు విధించిన శిక్షను కొట్టివేశారు. నిందితులంతా కోర్టులో హాజరుకావాలని పిటిషన్ జారీ అయింది.
Advertisement