సాక్షి, బళ్లారి : జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్‌పీ కార్యాలయం నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. సండూరు పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న సరస్వతి, జలజాక్షి, కూడ్లిగి పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న రమేష్ నాయక్, హిరేహడలి పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న గోపికృష్ణను సస్పెండ్ చేశారు. ఒక మహిళను అకారణంగా చితకబాదారనే ఆరోపణలపై సరస్వతి, వనజాక్షిని సస్పెండ్ చేశారు.
కూడ్లిగి తాలూకాలోని గుడేకోట పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ బళ్లారి నుంచి గుడేకోటకు బస్సులో వెళుతుండగా రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను కానిస్టేబుల్‌నని చెప్పినా అతను తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంటూ ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాఘవేంద్రను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ రమేష్ నాయక్ స్టేషన్‌కు చేరుకుని రాఘవేంద్ర నాయక్‌కు మద్దతుగా మాట్లాడాడు.
బస్సులో జనం ఉన్నప్పుడు మనిషి, మనిషి తగలడం సహజమేనని సమర్ధించాడు. అతన్ని విడుదల చేయాలని ఎస్‌ఐను నిలదీశాడు. ఈ విషయంపై ఎస్‌ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ రమేష్ నాయక్‌ను విచారించిన ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా విధులకు సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆరోపణలపై హిరేహడలి కానిస్టేబుల్ గోపీకృష్ణను సస్పెన్షన్ చేశారు.
నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
Published Sat, Oct 25 2014 3:19 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
Advertisement