సాక్షి, ముంబై: విద్యార్థులకు శుభవార్త!. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న పాఠశాల, కళాశాలల్లో ఇప్పటిదాకా విద్యార్థినులకు మాత్రమే 12వ తరగతి వరకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించారు. అయితే ఇప్పుడు విద్యార్థులకు కూడా ఆ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని విద్యాశాఖ మంత్రి రాజేంద్ర దర్డా తెలిపారు. దీనిపై వచ్చే ఆరు నెలల్లోగా అధికారిక ప్రకటన చేసే అవకాశముందన్నారు. నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమాన్ని రాజేం ద్ర దర్డా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే చదువు ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి విద్య అందాలని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయా లు తీసుకొంటోందన్నారు. అనేక చోట్ల విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని, దీంతో వారి సంఖ్య తగ్గుతుందని తెలిపారు. దీనికి కారణం ఆర్థిక సమస్యేనన్నారు.
అందుకే కనీసం 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రధానోపాధ్యాయుల వేతనాలు పెంచాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయని, దీనిపై కూడా ప్రభుత్వం అనుకూలంగా యోచిస్తోందన్నారు. ఈ సంవత్స రం ఏప్రిల్ ఒకటి నుంచి రూ.266 కోట్ల వేతనేతర నిధులను తొందరలో ఉపాధ్యాయులకు చేరవేస్తామని వెల్లడించారు. పాఠశాలలో పౌష్టిక ఆహారం బాధ్యతలు ప్రధానోపాధ్యాయులపై నెట్టేస్తున్నారని విలేకరులడిగిన ప్రశ్నకు రాజేంద్ర సమాధానమిస్తూ ఈ సమస్యను సమన్వయంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.