ప్రయాణికులను ప్రోత్సహించేందుకు కార్పొరేషన్ యోచన
పింప్రి, న్యూస్‌లైన్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీఆర్‌టీ మార్గాలలో ప్రయాణికులను ప్రోత్సహించేందుకు నెల రోజుల పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కార్పొరేషన్ యోచిస్తోంది. ఈ విషయమై పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్(పీఎంపీఎంఎల్) డెరైక్టర్లతో కార్పొరేషన్ చర్చలు కూడా జరుపుతోంది. సాతార మార్గం నుంచి హడప్సర్, ఆలంది మార్గం నుంచి నగర్ రోడ్డు వరకు బీఆర్‌టీ మార్గాలను చేపట్టారు. కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్, పుణేలలో బీఆర్‌టీ ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో ఈ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోంది.
కానీ పుణేలో ఇంకా ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగానే కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో నడుస్తున్న బీఆర్‌టీ తీరును గమనించి ఆలంది మార్గంలో ప్రారంభించాలని ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలందిలోని బీఆర్‌టీ మార్గం అన్ని హంగులను పూర్తి చేసుకుంది. విశ్రాంత్ వాడి నుంచి సంగంవాడి వరకు మార్గం పూర్తి అయింది. ఆటోమేటిక్ బస్టాపుల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇదిలా వుండగా పీఎంపీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని కార్పొరేషన్ యోచించినప్పటికీ ఈ ఖర్చు ఎవరు భరించాలన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే చర్చలు ముగిసి ఒక నిర్ణయానికి వచ్చి బీఆర్‌టీని ప్రారంభిస్తామని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు
బీఆర్‌టీ మార్గాల్లో ఉచిత ప్రయాణం
Published Wed, Dec 25 2013 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement