free bus transport
-
TSRTC: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుంచి దింపేశారు. ఇక, ఈ ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై సజ్జనార్ స్పందిస్తూ..‘టీఎస్ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు. #TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX — V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023 -
హవ్వా! మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే.. బుర్ఖా ధరించి..
బెంగుళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఇటీవల మహిళలకు శక్తి యోజన కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఒక హిందూ వ్యక్తి వేషం మార్చి బుర్ఖా ధరించి పట్టుబడ్డాడు. శక్తి యోజన పథకంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పించింది. అయితే దీన్ని అవకాశంగా చేసుకుని ధార్వాడ్ జిల్లాలో మత్తపాటి వీరభద్రయ్య అనే వ్యక్తి కొంచెం అటు ఇటుగా కటౌట్ మార్చుకుని బుర్ఖా ధరించి సాహసానికి తెగించాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బస్ స్టాప్ లోకి వచ్చి కూర్చున్నాడు. అతడిని చూడగానే అక్కడి వారికి అనుమానం రావడంతో ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. వారడిగిన ఏ ప్రశ్నకీ అతని వద్ద సమాధానం లేదు. బిక్షాటన చేసుకునేందుకే బుర్ఖా ధరించానని వీరభద్రయ్య చెప్పినా కూడా ఆ సమాధానానికి అక్కడివారు సంతృప్తి చెందలేదు. దీంతో బలవంతంగా ముసుగు తీశాక అసలు బాగోతం బయటపడింది. పైగా అతడి వద్ద మహిళ పేరుతో ఒక ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య -
బీఆర్టీ మార్గాల్లో ఉచిత ప్రయాణం
ప్రయాణికులను ప్రోత్సహించేందుకు కార్పొరేషన్ యోచన పింప్రి, న్యూస్‌లైన్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీఆర్టీ మార్గాలలో ప్రయాణికులను ప్రోత్సహించేందుకు నెల రోజుల పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కార్పొరేషన్ యోచిస్తోంది. ఈ విషయమై పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్(పీఎంపీఎంఎల్) డెరైక్టర్లతో కార్పొరేషన్ చర్చలు కూడా జరుపుతోంది. సాతార మార్గం నుంచి హడప్సర్, ఆలంది మార్గం నుంచి నగర్ రోడ్డు వరకు బీఆర్టీ మార్గాలను చేపట్టారు. కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్, పుణేలలో బీఆర్టీ ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో ఈ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోంది. కానీ పుణేలో ఇంకా ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగానే కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో నడుస్తున్న బీఆర్టీ తీరును గమనించి ఆలంది మార్గంలో ప్రారంభించాలని ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలందిలోని బీఆర్టీ మార్గం అన్ని హంగులను పూర్తి చేసుకుంది. విశ్రాంత్ వాడి నుంచి సంగంవాడి వరకు మార్గం పూర్తి అయింది. ఆటోమేటిక్ బస్టాపుల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఇదిలా వుండగా పీఎంపీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని కార్పొరేషన్ యోచించినప్పటికీ ఈ ఖర్చు ఎవరు భరించాలన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే చర్చలు ముగిసి ఒక నిర్ణయానికి వచ్చి బీఆర్టీని ప్రారంభిస్తామని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు